ఈ మధ్య కాలంలో భూకంపాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 20 వేలకు పైగా భూకంప ప్రకంపనలు నమోదవుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రకంపనలు చాలా వరకు బయటకు కనపడవు. ఇవి చాలా తేలికపాటివి. ఇవి సీస్మోగ్రాఫ్‌లో కూడా నమోదు కావు. కొన్ని ప్రాంతాల్లో భూకంపాల వల్ల ఎలాంటి నష్టం కలుగకపోగా ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి పరుగులు తీయడం, రాత్రి కాగానే టెన్షన్ పడటం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉంటాము. ప్రకృతి కన్నుఎర్రచేస్తే ఏఒక్కరూ మిగలరు. తాజాగా టర్కీలో పెనుభూకంపం చోటు చేసుకుంది. ఈ భూకంపాలు తీవ్ర బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భవనాలు కుప్పకూలిపోతున్నాయి. దీంతో తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాలు చవి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. భూప్రకంపనల కారణంగా క్షణాల్లోనే అల్లకల్లోలం అయిపోతుంది. అసలు భూకంపాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి..? అందుకు కారణాలు కూడా ఎన్నో ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.
భూకంపంవల్ల నష్టం కేవలం మనకే కాదు. పర్యావరణానికి కూడా చాలా నష్టం జరుగుతుందట. అయితే పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఉన్న నీటి కోసం అధికమైన భూగర్భజలాన్ని ఎక్కవ మొత్తంలో దుర్వినియోగం చేయడం, అడవుల్లో చెట్లను నరికివేయడం వంటి ప్రకృతి విరుద్దపనులు చేయడం వల్ల భూకంపాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయంటున్నారు. ప్రాజెక్టుల్లో ఉన్న వందలాది ఘనపు మైళ్ల నీటి ఒత్తిడి భూమిపై పడటం వల్ల భూగర్భంలో మార్పులు జరిగి భూమి కంపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న సమయంలో భూమి అంతర్గత పొరల్లో సర్దుబాట్ల ఫలితమే ఈ ప్రకంపనలు జరగడానికి కారణమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
భూమి నాలుగు పొరలతో నిర్మితమై ఉంటుంది. ఈ నాలుగు పొరలు ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్‌గా ఉంటాయి. క్రస్ట్ ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్పియర్ అంటారు. ఇది 50 కి.మీ మందపాటి పొర అనేక భాగాలుగా విభజించబడి ఉంటుంది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అని కూడా అంటారు. భూమి లోపల 7 ప్లేట్లు ఉన్నాయి. అవి తిరుగుతూ ఉంటాయి. ఈ పలకలు చాలా బలంగా కదిలినప్పుడు.. మనకు భూప్రకంపనలు వస్తాయి. క్రెప్ట్ కింద పొరను మాంటిల్ అంటారు. దాని మందం మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది. ఈ పొరతో పొలిస్తే హిమాలయాలు ఎంతో చిన్నవి. భూమిలోని కేంద్ర ప్రాంతాలలో ఉష్ణోగ్రత 8 వేల డిగ్రీల సెల్పియస్ ఉంటుంది. ఆ ప్రాంతంలో మరిగిన లావా మాంటిక్, క్రెస్ట్ లను చేధించుకొని బయటకు రావడం కొన్ని చోట్ల జరుగుతుంది. దీన్ని అగ్ని పర్వతం బద్దలైందని అనడం వినేఉంటారు.
భూమిలో ఉన్న పొరల కదలికలతో అనేక నష్టాలున్నాయి. భూమి లోపల చాలా కఠినమైన పొరలతో పాటు చిన్న పొరలు కూడా ఉంటాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అవి ఒకదానికొకటి కదులుతూ ఉంటాయి. ఈ కదలిక కారణంగానే ప్రకృతికి నష్టం వాటిల్లుతుంది. ఇక అధిక ఒత్తిడితో బయటకు వచ్చిన లావా ప్రభావంతో భూమి పైపొర అయిన క్రెస్ట్ 10 నుంచి 12 చలించే శిలాఫలకాలుగా ఏర్పడుతుంది. అయితే భూమిలో 12 పొరలు ఉంటాయని చెబుతున్నారు. లావా ఒత్తిడి, ఉష్ణోగ్రతలకు ఈ శిలా ఫలకాలలోని కొన్ని భాగాలలో కొన్ని కొన్ని సమస్యలు ఏర్పటంతో శిలాఫలకాలు ఒకదానికొకటి నెట్టుకుంటాయి. దాని వల్ల ఆ శిలాఫలకాలలో పగుళ్లు ఏర్పడి భూకంపలు ఏర్పడే అవకాశాలుంటాయని చెబుతున్నారు. శిలాఫలకాలలో ఏర్పడే పగుళ్ల స్థాయిని బట్టి ఈ భూకంపాలు సంభవిస్తాయి. భారీ ఆనకట్ట వల్ల, అణు ప్రయోగాల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఈ భూకంపం సమయంలో ధ్వని తప్పనిసరిగా వస్తుంది. సముద్రాలలో కూడా భూకంపాలు సంభవిస్తుంటాయి.
భూ ప్రకంపనలు నమోదు చేసే సాధనం గురించి తెలుసుకుందాం. భూప్రకంపనలు నమోదు చేసే సాధనాన్ని ‘సిస్మోగ్రాఫ్’ అంటారు. రెండో శతాబ్దంలో చైనాలో తొలిసారిగా సిస్మోగ్రాఫ్ ను తయారు చేశారు. దీనిలో స్ట్రింగ్ ల నుంచి స్థిరంగా వేలాడే బరువు కలిగి ఉంటుంది. దీనికి నాలుగు దిశల చలనాలను నమోదు చేయగల సాధనాలను జత చేసి ఉంచుతారు. ఈ సిస్మోగ్రాఫ్ వెనుకాల ఒక అద్దం ఉంటుంది. ఏ కారణంగానైనా భూమి కంపిస్తే దాని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరంగాలు వెనుకున్న అద్దాన్ని కదిలిస్తాయి. ఆ అద్దం నుంచి ప్రతిబింబించే కాంతి కిరణాలు నిత్యం తిరిగే గుండ్రని డ్రమ్ పైకి ఫోకస్ చేయబడి ఉంటాయి. అవి ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద పడుతూ ఉంటాయి. దీని వల్ల డ్రమ్ మీద ఉండే ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద చలించిన గీతలు ఏర్పడతాయి. ఈ విధంగా భూప్రకంపనలు గుర్తించగల్గుతున్నారు శాస్త్రవేత్తలు.
భూకంప తీవ్రతను ఎలా గుర్తిస్తారు అనే విషయం చాలామందికి తెలియదు. వీటి తీవ్రతను కేవలం రిక్టర్ స్కేల్ ఆధారంగా కొలుస్తారన్న విషయం తెలిసిందే. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అని కూడా అంటారు. భూకంపాలను రిక్టర్ స్కేలుపై 1 నుంచి 9 వరకు కొలుస్తారు. దీనిని భూకంపం సంభవించిన కేంద్రం నుంచి కొలుస్తారు. భూకంపం సంభవించిన ఆ సమయంలో భూమి లోపల నుంచి విడుదలయ్యే శక్తి తీవ్రతను లెక్కించి భూకంపాన్ని కొలుస్తారు. సాధారణంగా భూకంపాలు వచ్చిన సమయంలో దాని తీవ్రను కొన్ని పాయింట్లలో గుర్తిస్తారు అధికారులు. అయితే భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని అమెరికాకు చెందిన ఛార్లెస్ రిక్టర్ 1935లో కనుగొన్నారు. 3వేల 800 లీటర్ల పెట్రోలు ఇచ్చే శక్తికి సమానమైన శక్తి భూకంపం సందర్భంగా విడుదలవుతుందట. అది రిక్టర్ స్కేలు మీద రూ. 2.5కు సమానం. ఇది ఆరు దాటితే భూకంపం ప్రభావం అధికంగా ఉంటుంది. ప్లేట్ల కదలిక కారణంగా భూగర్భ శక్తి విడుదలయ్యే ప్రదేశానికి కొంచెం దిగువన భూకంప కేంద్రం ఉంటుంది. భూప్రకంపనలు ఎక్కువగా ఉండే ప్రదేశం ఇదే. ఈ కంపనం ఫ్రీక్వెన్సీ ఎంత దూరం ఉంటే.. దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. రిక్టర్ స్కేల్‌పై 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత ఉంటే.. భూకంపం సంభవించిన 40 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనలు సంభవిస్తాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం జంతువులు, పక్షులు ప్రకృతి వైపరీత్యాలను ముందే ఉహించగలవని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. ఇలా భూకంపాలు రావడానికి కారణాలు చాలా మందికి తెలియకపోయినా.. మానవళి చేస్తున్న తప్పిదాల వల్లనే భూప్రకంపనలకు దారి తీస్తుందంటున్నారు.
భూకంపాలు వివిధ రకాలుగా ఉంటాయి. నాభి లోతు ఆధారంగా భూకంపాలను మూడు రకాలుగా విభజింస్తారు.
1. గాథ భూకంపాలు
2. మాధ్యమిక భూకంపాలు
3. అగాథ భూకంపాలు
గాథ భూకంపాలు అంటే..
ఇవి ఉపరితలం నుంచి 0-60 కి.మీ వరకు వ్యాపించి ఉంటాయి. ఈ భూకంపాలు చాలా తరచుగా సంభవిస్తాయి. నాభి భూ ఉపరితలానికి సమీపంలో ఉండటంవల్ల తీవ్ర విధ్వంసం సృష్టిస్తాయి.
మాధ్యమిక భూకంపాలు అంటే..
ఇవి 60 కి.మీ నుంచి 300 కి.మీ లోతు వరకు వ్యాపించి ఉంటాయి.
అగాథ భూకంపాలు అంటే..
ఇవి 300 కి.మీ నుంచి 700 కి.మీ లోతు వరకు వ్యాపించి ఉంటాయి.
భూకంపం జరిగినప్పుడు భూమి ఒకే రకంగా కాకుండా వివిధ రకాలుగా చలిస్తుంది. ఇవి పలు రకాల విధ్వంసకర ప్రభావాలను కలిగి ఉంటాయి. అందులో కొన్ని ప్రధానమైన ప్రభావాలు చూపిస్తాయి.
భూకదలిక (Ground Shaking) నేల గుండా ప్రకంపన తరంగాలు ప్రయాణించడం వల్ల నేల వెనుకకు, ముందుకు చలిస్తుంది.
మృత్తికా భంగాలు (Soil Failures) భూకదలికల వల్ల నేల ద్రవీకరించడం, భూపాతాలు వంటివి ఏర్పడతాయి. ఉపరితల భ్రంశ (Surface Fault Ruptures) పగుళ్లు, నిలువు చీలికలు మొదలైనవి.
వేలా తరంగాలు (Tsunami) జలాశయ ఉపరితలంపై వచ్చే అతిపెద్ద తరంగాలు తీర ప్రాంతాల్లో భారీ నష్టానికి కారణమవుతాయి.
భూకంపాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి..
* భూ కంపాలు స్వతఃసిద్ధంగా సంభవిస్తాయి. అది సహజ లక్షణం. భూకంపాలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఆకస్మికంగా సంవత్సరంలో ఎప్పుడైనా సంభవిస్తాయి.
* వరదలు, చక్రవాతాలు (తుఫాన్లు) ఇతర ప్రధాన ఆకస్మిక విపత్తులకు దారితీసే వైపరీత్యాలు హెచ్చరిక వ్యవధిని కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి ముందుస్తు చర్యలు తీసుకోవడానికి, నివారించుకోవడానికి వాటి బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి కొంత అవకాశం ఉంటుంది.
* భూకంపాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండా వస్తాయి. వాటిని ముందుగా ఊహించడానికి, నివారించడానికి అవకాశం లేదు. అయినప్పటికీ దాని వల్ల సంభవించే విధ్వంసాన్ని మనం తగ్గించవచ్చు.
* భూప్రకంపనలు విభిన్న పౌనఃపున్యాలు వేగాల్లో సంభవిస్తాయి. భూకంపం వాస్తవ పగుళ్ల ప్రక్రియ కొద్ది సెకన్ల పాటు మాత్రమే ఉంటుంది. భారీ భూకంపం అయితే ఒక నిమిషం పాటు ఉంటుంది.
* పెను భూకంపాలు సాధారణంగా రెండు విరూపకారక పలకలు కలిసే కూడలి వద్ద సంభవిస్తాయి.
* ఉదాహరణకు ఇండియన్ పలకం, యూరేషియన్ పలకం కిందకు వెళ్లే హిమాలయ పర్వతశ్రేణి వెంబడి తీవ్ర భూకంపాలు ఏర్పడుతుంటాయి. ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన భూకంపాల్లో కొన్ని భారత్‌లో సంభవించడానికి ఇదే ముఖ్య కారణం.
ప్రపంచవ్యాప్తంగా సంభవించిన అతిపెద్ద భూకంపాలు..
1906 సంవత్సరంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో సంభవించిన భూకంపంలో రహదారులు, ప్రహరీగోడలు, ఇళ్లు ఇలా అనేకం 20 అడుగుల పక్కకు కదిలిపోయాయి
1939లో తూర్పు టర్కీలోని ఎర్జిన్కన్ భూకంపంలో దాదాపు 33,000 మంది చనిపోయారు.
1952లో రష్యాకు చెందిన కమ్చట్కా ద్వీపకల్పంలో 9 తీవ్రతతో భారీ భూకంపం నమోదైనట్లు అధికారులు గుర్తించారు.
1960లో చిలీలో సంభవించగా ఇప్పటి వరకు రిక్టర్ స్కేల్‌పై నమోదైన అతిపెద్ద భూకంప పరిమాణం 9.25. మొదటిది.
1964-65లో అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో ఏర్పడిన అతిపెద్ద భూకంపాలలో రెండో స్థానంలో నిలిచింది.
1999సంవత్సరం వాయవ్య టర్కీలో 7.4 తీవ్రతతో వచ్చిన భూకంపంలో 17,000 మందికి పైగా చనిపోయారు.
2004లో హిందూ మహాసముద్రంలో సుమత్రా, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామీ 14 దేశాల్లో రెండున్నర లక్షల మందికి మరణశోకం మిగిల్చింది. దీని తీవ్రత 9.1గా నమోదైంది.
నేపాల్‌లో భారీ భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. ఈ ప్రకంపనల ఎఫెక్ట్ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ప్రజలపై కూడా పడింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. భూప్రకంపం ధాటికి దోతి జిల్లాలో ఆరుగురు చనిపోయారు. మరికొంత మంది గాయపడ్డారు.
2011లో జపాన్ చరిత్రలోనే అతిపెద్ద భూకంపం సంభవించింది.
ఇటీవల కాలంలో రిక్టర్ స్కేల్‌పై 9.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్‌లోని పుకుషిమాలో 9.0 గా నమోదైంది.
2023 ఫిబ్రవరి న తుర్కియాలో జరిగిన భూకంపం అతి తీవ్ర ప్రమాదాన్ని మిగిల్చిందని రికార్డ్ లు సూచిస్తున్నాయి.