‌Hollywood Movies: స్టాప్, కెమెరా, రియాక్షన్.. హాలీవుడ్ సినిమా పరిశ్రమలో టెన్షన్..

సినిమా ప్రేమికులకు చేదు వార్త. ఇకపై హాలీవుడ్ సినిమాలు విడుదల కావు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గడిచిన మూడు నెలలుగా చేపట్టిన దీక్షకు పలువురి మద్దతు లభించింది. దీంతో అన్ని షూటింగులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇంతకూ వీరి సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని ప్రభావం మనపై ఎలా చూపుతుందో తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 04:08 PM IST

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఫిక్షన్ అనే నిధిని కావల్సినంత తవ్వి తీసి వాటికి మెరుగులు దిద్ది బంగారు ఆభరణం లాంటి కథతో తెరకెక్కిస్తారు. అందుకే హాలీవుడ్ సినిమాలు అంతటి ప్రజాధారణ సంపాదించుకున్నాయి. వాళ్లు అనుకున్న కాన్సెప్ట్ రీచ్ అయ్యే వరకూ ఎక్కడా విశ్రమించరు. మన టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎస్ ఎస్ రాజమౌళి మాత్రమే పని రాక్షసుడైతే.. హాలీవుడ్ లో ప్రతి డైరెక్టర్ జక్కన్నలే అని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. వారి ఫ్రేమింగ్, టేకింగ్, బీజీఎం అలా ఉంటుంది. ఇంతటి ఆదరణ కలిగిన సినిమాలు ఎందుకు షూటింగ్ కు నోచుకోకుండా సమ్మె సైరన్ మోగించాల్సి వచ్చింది.? దీని వెనుక అసలైన కారణాలు ఏంటి.? అనే సందేహం మీకు కలుగకమానదు.

ప్రపంచ స్థాయిలో అన్ని దేశాల నుంచి అద్భుతమైన ఆదరణ గలిగిన సినిమా పరిశ్రమకు రెండు ప్రదానమైన సమస్యలు వచ్చి పడ్డాయి. ఈ సమస్యల్లో ఒకటి సాంకేతిక పరంగా అయితే మరొకటి ఆర్థిక పరంగా. అందుకే ఈ రెండింటి కారణంగా సినిమా ట్రైలర్ మొదలు రిలీజ్ వరకూ.. షూటింగ్ మొదలు డిస్టిబ్యూషన్ వరకూ అన్ని శాఖలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. స్టార్ట్ కాస్త స్టాప్ గా, కెమెరా కాస్త బ్లర్గా, యాక్షన్ కాస్త రియాక్షన్ వినిపిస్తూ కనిపించేలా పరిస్థితులు మారిపోయాయి. ఇటీవల వచ్చిన దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తగిన వేతనం ఇవ్వకపోవడం చాలా మందికి ఆగ్రహాన్ని కలిగించింది. కెమెరా కంటే ఇప్పుడు కాస్త బూన్ వచ్చింది కానీ.. లైటింగ్, ప్రొడక్షన్ టీంపై చిన్న చూపు చూసే పరిస్తుతులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. వీరి కనీస అవసరాలకు కావల్సిన జీతాలు ఇవ్వడంలో మొండిచెయ్యి చూపిస్తున్నారు నిర్మాతలు. దీనిపై వీరు ఆగ్రహంతో కనిపిస్తున్నారు.

Writers and actors in the Hollywood film industry have called for a strike

సమ్మెకు బలం ఇదే..

ఈ సమ్మెకు బలం చేకూర్చడానికి ప్రముఖ హాలీవుడ్ అగ్రతారలు ముందుకు వచ్చారు. వీరు పైన చెప్పుకున్న ఆయా శాఖల వారికి మద్దతు ఇవ్వడం కోసం రాలేదు. వీరికి కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం వల్ల సమ్మెలో పాల్పంచుకున్నారు. ఇప్పుడున్న సాంకేతికత మనకంటే ఫారెన్ కంట్రీలే త్వరగా అందిపుచ్చుకుంటాయి. అందులో భాగంగా అధునాతన ఏఐ టెక్నాలజీ ఉపయోగించి హీరో, హీరోయిన్ లేకుండానే సీన్లు తీసుకుంటున్నారు దర్శకులు. కృత్రిమ మేధను అనుసరించి నటీనటుల సన్నివేశాలను వారి అవసరం లేకుండానే చిత్రీకరిచండంతో వీరికి ఉపాధి కరువైంది. దీంతో నిరవధిక సమ్మెకు తొలి అడుగు వేసింది.

ఆరు దశాబ్ధాల తరువాత

ఈ చిత్రపరిశ్రమలోని కార్మికులు దాదాపు 10 వారాల పైబడి నిరసన చేస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు. కొన్ని నిర్మాణ సంస్థలతో సంప్రదింపులు జరిపినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు. అందుకే స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు. ఈ గిల్డ్ ద్వారా బంద్ చేస్తున్న వారి సంఖ్య అక్షరాలా లక్షా 60వేలకు పైమాటే. వీరిలో రచయితలు, నటీ నటులతో పాటూ చిన్న స్థాయి సినిమా కార్మికులు పాల్గొన్నారు. దాదాపు 63 ఏళ్ల తరువాత ఇంతటి స్థాయిలో సమ్మె జరగడం ఇదే మొదటి సారి. 1960లో అప్పటి సుప్రసిద్ధ నటుడు రోనాల్డ్ రీగన్ ఆధ్వర్యంలోని రెండు టీంలు ధర్నా చేశాయి. ఈయన అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇలా అందరూ కలిసి ఒక్కటవడంతో ఇప్పటి వరకూ పెండింగ్ లో ఉన్న సినిమాలు విడుదలలో కాస్త జాప్యం జరుగవచ్చు. తాజాగా ప్రారంభమైన చిత్రాలు పూర్తి స్థాయిలో షూటింగ్ కు బ్రేక్ వేశారు. ఇక ఓటీటీ వేదికలపై విడుదలయ్యే సినిమాలు సైతం నిలిచిపోయాయి.

మనదేశంలో దీని ప్రభావం

మనకు భారతీయుల్లో చాలా వరకు హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా లైక్ చేస్తారు. ఏ కొత్త సినిమా విడుదల అయినా మొదటిరోజే ధియేటర్లలోకి వెళ్లి చూసేందుకు ఆసక్తిచూపుతారు. ఎందుకంటే యాక్షన్ సీన్స్ పెద్ద స్క్రీన్ పై ఆ సౌండ్స్ ఎఫెక్ట్ నడుమ త్రీడీలో చూస్తే ఆ కిక్కే వేరు అని భావిస్తారు. ఇలాంటి వారికి తీరని నిరాశ అని చెప్పాలి. ఇక కరోనా కారణంగా ఓటీటీలకే పరిమితం అయిన ప్రేక్షకులకు కూడా ఇది తీరని లోటును మిగిల్చింది అని చెప్పాలి. దీనిని కారణం హాలీవుడ్ స్థాయి ఏ సినిమా అయినా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి వేదికలపై విడుదలకు నోచుకుంటాయి. అలాంటిది ఈ సమ్మె ప్రభావంతో చిన్న సినిమాలు, వెబ్ సీరిస్ ల చిత్రీకరణ నిలిచిపోయింది. అందుకే మైన్ స్ట్రీమింగ్ సినిమాలతో పాటూ ఓటీటీలకు కూడా గడ్డుకాలంగా చెప్పాలి.

T.V.SRIKAR