Organ Donation: ఆ ఒక్క గుండె ఆగింది. ఐదుగురి గుండె మోగింది. చనిపోతూ ఐదుగురికి ప్రాణం పోశాడు ఓ వ్యక్తి. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో ఐదుగురికి పునర్జన్మ లభించింది. మనిషి చనిపోయాక దేహం మట్టిలో కలుస్తుంది.. అదే ఆ వ్యక్తి అవయవాలను అవసరమైన వారికి అమరిస్తే.. మరికొందరికి జీవితం లభిస్తుంది. ఇలాగే ఆలోచించారు ఆ యువకుడి కుటుంబసభ్యులు. బ్రెయిన్ డెడ్ కావడంతో ఆస్పత్రిలో ఉన్న యువకుడి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు కుటుంబ సభ్యులు.
ఐదుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. ఓ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కట్ట కృష్ణ అనే యువకుడు.. బ్రెయిన్ డెడ్ అయ్యాడు. బిడ్డను అలా ఆసుపత్రి బెడ్ మీద చూసి.. ఆ తల్లిదండ్రులు పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి ఆవేదనలో ఉండి కూడా.. ఐదుగురి జీవితాలకు ఉపయోగపడేలా అవయవాలను దానం చేసిందా కుటుంబం. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో డాక్టర్లు కృష్ణ అవయవాలను తరలించారు. లివర్, రెండు కిడ్నీలను గ్రీన్ చానెల్ ద్వారా.. గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. గుండెను హెలికాప్టర్ సాయంతో తిరుపతి పద్మావతి ఆసుపత్రికి తరలించారు.
కృష్ణ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మడియాలో హాట్‌టాపిక్ అవుతోంది. కృష్ణ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయంపై.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ ఐదుగురి రూపంలో కృష్ణ ఎప్పుడూ బతికే ఉంటారంటూ పోస్టులు పెడుతున్నారు.