Young Ugadi: పట్టణ పరువాలు చిగురించి – పల్లె పరంపర క్షీణించిన సంప్రదాయం..!

తెల్లారే లేచాను.. ఏమ్.? ఎక్కడికైనా ప్రయాణమా..! కొత్త బట్టలు కట్టాను.. ఎందుకు.? నీ పుట్టిన రోజా..! పిండివంటలు చేశాను.. ఏమిటి.? ఎవరిదైనా పెళ్లా..! కాదురా బాబూ, నూతన తెలుగు సంవత్సరాది "యుగాది".

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 07:45 PM IST

ఓ బామ్మా, ఇద్దరు మనవళ్ళ మధ్య జరిగిన ఇరు సంభాషణలు చూశారు కదా, మన తెలుగు క్యాలెండర్ లో వచ్చే తొలి పండుగని ఎంత తేలిగ్గా మర్చిపోయారో. ఇంతకన్నా అసాధారణమైన విషయం మరొకటి ఉంటుందా, చెప్పండి? ఇలా మారిపోయింది ప్రస్తుత టెక్నోయుగంలో సాంప్రదాయాల పరిస్థితి.

ఒకప్పుడు మన తెలుగు పండుగలు అంటే ముందురోజు సాయంత్రం నుంచే హడావిడి సాగేది. దానికి సంబంధించిన వస్తుసామాగ్రిని ఏర్పాటు చేసుకోవడం మొదలు, మరుసటి రోజు రాత్రి కనురెప్ప వాల్చే వరకు. కానీ ప్రస్తుతం దీని స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఎంతగా అంటే..! బట్టలు కొనాలంటే తమ తల్లిదండ్రులతో వెళ్లి పెద్దలు ఇప్పించిన దుస్తులు కొనుగోలు చేసే కాలం పోయింది. నేడు పండుగకు ఒక రోజు ముందు ఆన్లైన్లో తనకు తానే స్వయంగా బట్టలు కొనుగోలు చేసి పండుగ రోజు ఉదయాన్నే ఆర్డర్ డెలివరీ బాయ్ ఇస్తే గాని కొత్త బట్టలు వేసుకోలేనంతగా మార్పు వచ్చింది. అలాగే పండుగ స్నానం, పూజ, పండుగ విశేషం, పెద్దల ఆశీర్వాదం, దేవాలయ దర్శనం, రకరకాల పిండి వంటలు, ఇరుగుపొరుగుతో మాటామంతి వీటన్నింటికీ అడ్డుకట్ట వేశారు.

భానుడి కిరణతాపంతో నిద్రలేచి పట్టుమని పది నిమిషాలు కూడా నూనెఅంటులో నిలువకుండా.. షాంపూతో స్నానం చేసి పాశ్చాత్య దుస్తులు ధరిస్తున్నారు. ఇక బయటకు అలా షికారుకు వెళ్లి మధ్యాహ్నం వచ్చి ఏదో వండిన పదార్థాలను తిని సేదతీరుతున్నారు. సాయంత్రం లేచి యధావిధిగా రోజు లాగానే.. పండుగ రోజు కూడా పాత మొగుడేనా అని అదేదో సామెత ఉన్నట్లు.. పండగ రోజు కూడా పాత పద్దతులేనా అనేలాగా మార్పు వచ్చింది. అసలు ఈ విధమైన మార్పు కారణాలు ఏంటో తెలుసుకుందాం.

Busy Busy Life

ప్రస్తుతం ఎవరెవరి వృత్తి, కార్యకలాపాల్లో వారు బిజి బిజి బ్రతుకుల గజి బిజి ఉరుకుల పరుగులలో అని సాహిత్య రచయిత వేటూరి అన్న మాటలు నిజమయ్యాయి. పండగంటే చాలు పట్నం నుంచి ఒక కాలేజీ బ్యాగ్ లగేజ్ భుజాన వేసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు వున్న తరంవారు. పల్లెల్లో కూడా పెద్దలు, తల్లిదండ్రులు, అవ్వలు, ఉంటే మునిఅవ్వలు కూడా తమ తమ పిల్లల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. నా బాబు లేదా బిడ్డ ఎప్పుడెప్పుడు మా ఇంటి పండక్కి వస్తాడా అని.!

అలా అరుదుగా వచ్చి పబ్బం బాగా జరుపుకొని మళ్లీ తమ తమ పనుల్లోకి మెల్లగా తిరుగు పయనమవుతారు. ఈ విధంగా రావటానికి.. తిరిగి వెళ్లడానికి మధ్య ఒక చీకటి తెర ఉంది. అదే పట్నంలోని వ్యవహారాలకు,అలవాట్లకు బాగా మొగ్గు చూపిన వారు తిరిగి పల్లెల్లోకి వెళ్లినప్పుడు, పండుగ పద్దతి, సంప్రదాయాన్ని అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే ఉండే రెండు లేదా మూడు రోజులకు తమ సిటీ కల్చర్ ని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అలా కొనసాగితే తమ వరకు ఆనందంగానే ఉంటుంది. అదే ఒక తరం తరలిపోయాక ఒక వింత మార్పుకు బీజం వేస్తుంది. ఆ బీజం ఒక వృక్షంలా మారి పచ్చని మామిడి తోరణాలవలే ఉన్న పల్లె పండుగ సంప్రదాయాన్ని, గ్రీష్మంలో రాలిపోయిన ఎండుటాకుల్లా మార్చేస్తుంది. ఉగాది అంటేనే చిగురించిన పచ్చదనం. కానీ ఇక్కడ మనం చేస్తున్నది ఏంటో గమనించండి. అదే ఇక్కడి మిసీ.

ఒకవేళ తమ పిల్లల అలవాట్లకు భిన్నంగా ఇంట్లో పెద్దలు ఏమైనా అంటే.. ఇక అసలు పండక్కి వచ్చే ఒక రోజు కూడా ఎక్కడ రాకుండా పోతారో అన్న భయంతో, ఒకవేళ తమని పట్నానికి పిలిస్తే పల్లెల్లోని పండుగ శోభ ఎక్కడ కనుమరుగవుతుందో అన్న ఆలోచనతో, ఇలా భయానికి – ఆలోచనకి మధ్య ఊగిసలాడుతూ ఉన్నారు మన ఊర్లో పెద్దలు.

అందుకే ఇలాంటి యాంత్రిక సంప్రదాయానికి తెరదించి పచ్చని మామిడి తోరణాల మధ్య.. కరికోకిల కూహూ..కూహూ.. రాగాల నడుమ శోభకృత్ నామ సంవత్సర యుగాదిని జరుపుకుంటారని ఆశిద్దాం.

 

T.V.SRIKAR