ఆసీస్ టూరే చివరిదా ? రోహిత్,కోహ్లీ కెరీర్ ముగిసినట్టే

ఒకరేమో కెప్టెన్... మరొకరేమో మాజీ కెప్టెన్... సమకాలిన క్రికెట్ లో ఇద్దరూ ఇద్దరే... ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్ళు... అదంతా గతం.. ఇప్పుడు పేలవ ఫామ్ తో సతమతం..

  • Written By:
  • Publish Date - November 4, 2024 / 01:11 PM IST

ఒకరేమో కెప్టెన్… మరొకరేమో మాజీ కెప్టెన్… సమకాలిన క్రికెట్ లో ఇద్దరూ ఇద్దరే… ఎన్నో రికార్డులు, మరెన్నో మైలురాళ్ళు… అదంతా గతం.. ఇప్పుడు పేలవ ఫామ్ తో సతమతం.. ఆ ఇద్దరూ మరెవరో కాదు భారత సారథి రోహిత్ శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ…నాయకుడిగా జట్టును సమర్థవంతంగా నడిపించడంతో పాటు వ్యక్తిగతంగానూ రాణిస్తేనే గుర్తింపు ఉంటుంది. కానీ రోహిత్ మాత్రం ఇప్పుడు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అలాగే రన్ మెషీన్ గా పేరున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు పరుగులు చేసేందుకే ఇబ్బంది పడుతున్నాడు. నిజానికి భారత క్రికెట్ లో రోహిత్ , కోహ్లీ సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే గతంతో పాటు వర్తమానంలోనూ ఫామ్ కొనసాగిస్తేనే జట్టులో చోటుంటుంది. లేకుంటే కొన్ని సిరీస్ ల తర్వాత కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఇప్పుడు రోహిత్, కోహ్లీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. న్యూజిలాండ్ తో సిరీస్ లో వైట్ వాష్ పరాభవంతో బీసీసీఐ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.

జాతీయ మీడియా కథనాల ప్రకారం ఆస్ట్రేలియా పర్యటన తర్వాత సీనియర్ ప్లేయర్స్ పై బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పేలవ ఫామ్ తో సతమతమవుతున్న వీరిద్దరికీ ఆసీస్ టూరే చివరిది కానుందనేది బోర్డు వర్గాల సమాచారం. ఒక మ్యాచ్ ఆడకుంటే పెద్ద పట్టించుకునేవారు కాదు.. కానీ సిరీస్ మొత్తం ఫ్లాప్ అవ్వడంతో అటు సెలక్టర్లు కూడా ఆలోచనలో పడ్డారు. కివీస్ తో సిరీస్ లో అది కూడా సొంతగడ్డపై వారి నుంచి ఇలాంటి ఆటను ఎవ్వరూ ఊహించలేదు. ఓ పక్క యశస్వి, గిల్‌ లాంటి కుర్రాళ్లు క్రీజ్‌లో నిలబడి పోరాడుతుంటే.. మరోవైపు ఈ ఇద్దరూ ఎప్పుడు పెవిలియన్‌కి వెళ్లిపోదామా అన్నట్లుగా వికెట్లు పారేసుకున్నారు. రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో చేసిన కేవలం 91 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ 15.50 సగటుతో 93 పరుగులే చేశాడు. ఓ సిరీస్‌లో వీరిద్దరి అత్యంత దారుణమైన ప్రదర్శన ఇదే. ఇదిలా ఉంటే స్పిన్ ను ఎదుర్కోవడంలోనూ కోహ్లీ ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ నాలుగు సార్లు స్పిన్నర్లకు వికెట్ ఇవ్వగా.. ఒకసారి పేసర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రోహిత్‌ అయితే తన వీక్ నెస్ షార్ట్ పిచ్ బాల్స్ నుంచి ఇంకా బయటపడడం లేదు.

ఆస్ట్రేలియాతో సిరీస్ కు ముందు కోహ్లీ, రోహిత్ ఫామ్ ఒక్కటే భారత్ ను టెన్షన్ పెడుతోంది. నిజానికి కివీస్ తో సిరీస్ ఓటమికి కారణం బ్యాటర్ల వైఫల్యమే…బాధ్యతాయుతంగా ఆడాల్సిన వీరిద్దరూ క్రీజులో నిలవలేకపోయారు. కోహ్లీ అయితే గత 10 నెలల కాలంలో టెస్ట్ ఫార్మాట్ లో బాగా వెనుకబడిపోయాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ దుమ్మురేపుతూ రికార్డులు కొల్లగొడుతుంటే విరాట్ మాత్రం ఇంకా 29వ శతకం దగ్గరే ఆగిపోయాడు. మునుపటి హిట్ మ్యాన్ , రన్ మెషీన్లను అభిమానులు చూసి చాలారోజులయింది. అయితే ఆసీస్ టూర్ లోనూ కోహ్లీ,రోహిత్ విఫలమైతే మాత్రం కెరీర్ ముగిసినట్టే. ఎందుకంటే మళ్ళీ జూలైలో ఇంగ్లాండ్ టూర్ కు కోహ్లీ, రోహిత్ లతో పాటు అశ్విన్, జడేజాలను సైతం బీసీసీఐ పక్కన పెట్టేయడం ఖాయం. అందుకే స్వదేశంలో వీరంతా చివరి టెస్ట్ ఆడేసారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆసీస్ టూర్ తో రోహిత్, కోహ్లీ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడే అవకాశముందని చెప్పొచ్చు.