India, Pakistan : మార్చి 1న భారత్, పాక్ మ్యాచ్.. వేదిక ఎక్కడో తెలుసా ?

భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఓ వైబ్రేషన్... కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాదు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే పోరు.

భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఓ వైబ్రేషన్… కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాదు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూసే పోరు. భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో ఇరు జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఇటీవల టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ , పాక్ మ్యాచ్ అభిమానులను అలరించింది. మళ్ళీ దాయాదుల సమరం ఎప్పుడు ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మినీ వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న పాక్ క్రికెట్ బోర్డు తాజాగా షెడ్యూల్ పై కసరత్తు చేస్తోంది.

ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ జరగనుంది. పిసిబి పంపిన షెడ్యూల్ కు ఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు మార్చి 1న లాహోర్‌లోని గడ్డాఫి స్టేడియం వేదికగా తలపడాల్సి ఉంది. ఈ షెడ్యూల్‌కు ఐసీసీ ఆమోదం తెలిపినా.. బీసీసీఐ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్నఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో బీసీసీఐ తమ ప్రభుత్వ అనుమతిని తీసుకోవాల్సి ఉంది. చివరిసారిగా 2008‌లో టీమిండియా.. పాకిస్థాన్‌లో పర్యటించింది. ప్రస్తుతం భారత్ తప్ప మిగిలిన దేశాలు పాక్ వెళ్ళేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపిస్తుందో లేదో చూడాలి.