Sri Lanka Vs New Zealand: నిద్రమత్తులో అంపైర్లు 11 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసిన బౌలర్

సాధరణంగా ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కో జట్టు 50 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉండగా.. ఒక బౌలర్ గరిష్టంగా 10 ఓవర్లు మాత్రమే వేయాలి.

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 02:42 PM IST

ఒక వన్డే మ్యాచ్‌లో ఓ బౌలర్ 10 ఓవర్లకు మించి వేయరాదు. అయితే ఓ మహిళా బౌలర్ ఏకంగా 11 ఓవర్లు వేసింది. ఈ ఘటన తాజాగా శ్రీలంక, న్యూజిల్యాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో జరిగింది. అంపైర్ల అజాగ్రత్త, కెప్టెన్ గమనించకపోవడంతో ఈ తప్పిదం జరిగింది. గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో న్యూజిల్యాండ్ మహిళల జట్టు రెండో ఒన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు 48.3 ఓవర్లలో 213 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దాంతో శ్రీలంకపై న్యూజిల్యాండ్ 111 పరుగులతో విజయం సాధించింది.

ఇక లంక చేసిన 213 పరుగులలో అదనపు పరుగులే 43 ఉండడం విశేషం. కివీస్ బౌలర్లు ఏకంగా 26 వైడ్స్ ఇచ్చారు. అయితే అంపైర్ల పొరపాటుతో న్యూజిలాండ్ బౌలర్ ఈడెన్ కార్సన్ ఏకంగా 11 ఓవర్లు బౌలింగ్ చేసింది. అంటే తన కోటాకు మించి ఓ ఓవర్ ఎక్కువగా వేసింది. అంపైర్లు గమనించకపోవడం, కెప్టెన్ చూసుకోకపోవడానికి, కార్సన్ నిర్లక్యం కూడా తోడవ్వడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచులో 11 ఓవర్లు బౌలింగ్ వేసిన కార్సన్ 41 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. ఈ విషయం తెలిసిన ఫాన్స్ అంపైర్లపై మండిపడుతున్నారు. అలానే ఐసీసీపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.