Virat Kohli: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి జరిగే క్రికెట్ ప్రపంచ కప్ కోసం అన్ని జట్లూ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఈ టోర్నీ కూడా ప్రతి ప్రపంచ కప్ మాదిరిగానే చాలా మంది ఆటగాళ్లకు చివరిది కానుంది. ఇలా చివరిసారిగా ప్రపంచ కప్ టోర్నీలో కనిపించబోతున్న ఆటగాళ్లలో భారత ప్లేయర్లు కూడా ఉన్నారు. గత రెండేళ్లుగా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మకు దాదాపుగా ఇదే చివరి ప్రపంచ కప్. జూన్ 2007 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మకు ఇప్పటికే 36 సంవత్సరాలు.
ఇప్పటికే టీ20 క్రికెట్‌లో కనిపించకుండా ఉన్న రోహిత్ వచ్చే వరల్డ్ కప్ 2027 వరకు వన్డే క్రికెట్ ఆడాలంటే అద్భుతాలు జరగాల్సిందే. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన ఆర్ అశ్విన్‌కి 2023 టోర్నీలో ఆడే అవకాశమే అనూహ్యంగా లభించింది. క్రికెట్‌పై మక్కువతో జాతీయ జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తున్న యువ ఆటగాళ్ల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో అశ్విన్ కెరీర్ త్వరలోనే ముగిసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అశ్విన్‌కి కూడా ఇది చివరి ప్రపంచ కప్ కావచ్చు. రన్ మెషిన్, చేజ్ మాస్టర్‌గా అవతరించిన విరాట్ కోహ్లీ క్రికెట్‌కు దూరం కావాలని ఏ ఒక్కరూ కోరుకోరు.
కానీ ఇప్పటికే 35 సంవత్సరాల వయసు, 3 వరల్డ్ కప్ టోర్నీలు ఆడిన అనుభవం కలిగిన కోహ్లీ తన నాలుగో వరల్డ్ కప్ ఆడబోతున్నాడు. 2011 ప్రపంచ కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడైన కోహ్లీ ఈ టోర్నీ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే కనిపించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.