Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌పై, సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా అభిమానులంతా రాహుల్ ద్రవిడ్‌ను అపార్థం చేసుకున్నారని తెలిపాడు. అతను చేసిన ప్రయోగాలతో విసిగెత్తిపోయిన జనాలు ద్రవిడ్‌ను అనవసరంగా తిట్టారని గుర్తు చేశాడు. ప్రస్తుతం టీమిండియా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిచిందంటే అందులో ద్రవిడ్ కృషి ఎంతో ఉందని, విమర్శకులు ఇప్పుడేం అంటారని డివిలియర్స్ ప్రశ్నించాడు.
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఏబీ డివిలియర్స్.. మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన భారత జట్టును ప్రశంసించాడు. ‘ఒకే సమయంలో మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవడం చాలా గొప్ప ఘనత. భారత్ ఈ మైలురాయిని అందుకుంది. ఇలా మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలవడం చాలా అరుదు. ప్రపంచకప్ ముందు నెంబర్ వన్ ర్యాంక్ అందుకోవడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతోంది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను జనాలు తిట్టని తిట్లు తిట్టారు.
అతను టీమిండియా హెడ్ కోచ్‌గా సరిపోడని విమర్శించారు. అతని ప్రయోగాలను తప్పుబట్టారు. జట్టును నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. కానీ ఈ మాటలను ద్రవిడ్ పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయాడు. దాంతో టీమిండియా మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ ర్యాంక్ అందుకుంది. విమర్శకులు ఇప్పుడు ఏం అంటారో చూడాలి’ అని ఏబీ డివిలియర్స్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు.