ఐపీఎల్ మెగావేలం ఆ ముగ్గురికీ రూ.20 కోట్లు పైనే ?

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 04:50 PM IST

ఐపీఎల్ మెగా వేలం కోసం ఇటు బీసీసీఐ, అటు ఫ్రాంచైజీలు సన్నద్ధమవుతున్నాయి. ఏడాది చివర్లో జరగనున్న వేలంలో ఎవరు అత్యధిక ధర పలుకుతారన్న అంచనాలు మొదలైపోయాయి. ఈ సారి అన్ని జట్ల కూర్పు మారిపోవడం ఖాయమైన నేపథ్యంలో సరికొత్త రికార్డులు నమోదవడం ఖాయం. రిటెన్షన్ రూల్స్ ను బీసీసీఐ ఇంకా ఖాయం చేయకపోయినా పలువురు స్టార్ ప్లేయర్స్ మాత్రం వేలంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. దీంతో కొందరు క్రికెటర్ల ధర 20 కోట్ల పైనే పలుకుతుందని అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మను ముందుగా చెప్పుకొవాలి. హార్థిక్ పాండ్యాను సారథిగా ఎంపిక చేసిన తర్వాత హిట్ మ్యాన్ యాజమాన్యం తీరుతో కాస్త కోపంగానే ఉన్నాడు. ఒకవేళ రోహిత్ వేలంలోకి వస్తే 20 కోట్ల పైనే పలుకుతాడని అంచనా వేస్తున్నారు. కెప్టెన్ గా ఐదుసార్లు ముంబైని ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ కోసం ఫ్రాంచైజీలు భారీ మొత్తమే చెల్లించేందుకు సిద్ధపడుతున్నాయి.

అలాగే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కు కూడా ఈ సారి వేలంలో మంచి డిమాండ్ ఉంటుందని అంచనా.. గత సీజన్ లో పరుగుల వరద పారించిన రాహుల్ మంచి కెప్టెన్ గానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. రాహుల్ వికెట్ కీపింగ్ బ్యాటర్ గానే కాకుండా సారథిగానూ జట్టును నడిపిస్తుండడంతో ఫ్రాంచైజీలు అతని కోసం ప్రయత్నించడం ఖాయం. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న
హెన్రిట్ క్లాసెన్ పై ఈ సారి వేలంలో కోట్ల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. గత సీజన్ లో క్లాసిన్ బ్యాటింగ్ విధ్వంసాన్ని అభిమానులు మరిచిపోలేరు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి హిట్టర్ కోసం 20 కోట్లయినా ఖర్చు చేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.