Naveen ul Haq: క్రికెట్ అంటే ప్యాషన్ ఉండాలి.. సంపాదన మోజు కాదు..!

భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. 24 ఏళ్ల నవీన్ ఉల్ హక్ ఆడింది 7 వన్డేలు మాత్రమే.

  • Written By:
  • Publish Date - September 28, 2023 / 04:58 PM IST

Naveen ul Haq: అఫ్గానిస్థాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. 24 ఏళ్ల నవీన్ ఉల్ హక్ ఆడింది 7 వన్డేలు మాత్రమే. ఇందులో అతను 14 వికెట్లు మాత్రమే తీసాడు. అయితే వన్డేల నుంచి తప్పుకొని పూర్తిగా టీ20లపై ఫోకస్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నవీన్ ఉల్ హక్ వెల్లడించాడు.

‘వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్ నుంచి నిష్క్రమించాలనుకుంటున్నా. నా దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం గర్వకారణం. వన్డేల నుంచి తప్పుకున్నా టీ20ల్లో కొనసాగుతా. నా కెరీర్‌ను సుదీర్ఘ కాలం కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నాకు అన్ని విధాలా సహకరించిన అఫ్గాన్ క్రికెట్ బోర్డు, అభిమానులకు ధన్యవాదాలు’అని నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌పై ఉన్న మోజుతోనే నవీన్ ఉల్ హక్ వన్డేలకు దూరమవుతున్నాడని సొంత అభిమానులే అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. నవీన్ ఉల్ హక్ తన ఆటతో కంటే వివాదాలతోనే ఎక్కువ గుర్తింపు సాధించాడు.

పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ లో దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదితో గొడవ పడ్డ నవీన్ ఉల్ హక్.. ఐపీఎల్ 2023 సీజన్‌లో విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న నవీన్ ఉల్ హక్.. ఆర్‌సీబీ తో జరిగిన ఓ మ్యాచ్‌లో కోహ్లీతో గొడవపడ్డాడు. ఈ ఇద్దరి గొడవ కాస్త గంభీర్-, కోహ్లీ మధ్య పెద్ద గొడవకు దారితీసింది. అప్పట్లో ఈ వివాదాలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. అంతటితో ఆగకుండా నవీన్ ఉల్ హక్ సోషల్ మీడియా వేదికగా కూడా కయ్యానికి కాలు దువ్వాడు. కోహ్లీ బ్యాటింగ్‌ను ఉద్దేశించి మామిడి పండ్లు బాగున్నాయని ట్రోల్ చేశాడు.

అప్పటి నుంచి నవీన్ ఉల్ హక్‌పై కోహ్లీ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఆసియా కప్ 2023 ఎంపిక చేసిన అఫ్గాన్ జట్టులో చోటు దక్కించుకోకపోయిన నవీన్ ఉల్ హక్ వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా అఫ్గాన్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నవీన్ ఉల్ హక్‌కు కోహ్లీకి చుక్కలు చూపిస్తాడనే ధీమాతో ఉన్నారు.