ఆస్ట్రేలియా జట్టుకు యాషెస్ సిరీస్ ఎంత ప్రతిష్టాత్మకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ గెలిచేందుకు అటు ఇంగ్లాండ్, ఇటు ఆసీస్ ప్రాణం పెట్టి ఆడతాయి. ఇలాంటి సిరీస్ కంటే కూడా ఇప్పుడు భారత్ తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే తమకు కీలకమంటున్నారు ఆసీస్ క్రికెటర్లు…. నిజానికి గత దశాబ్దకాలంగా ఆసీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే… వారి గర్వాన్ని అణిచి, పొగరు దించి భారత్ టెస్ట్ సిరీస్ విజయాలను అందుకుంది. గత రెండు పర్యాయాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కంగారూలను చిత్తుగా ఓడించింది. అప్పటి నుంచీ ఆసీస్ క్రికెటర్లకు, మాజీలకు నిద్ర పట్టడం లేదు. ఎలాగైనా సరే ఈ సారి జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ ను గెలుచుకోవాలని కంగారూలు ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే మైండ్ గేమ్ మొదలుపెట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అదే సమయంలో యాషెస్ సిరీస్ ను కూడా ఆసీస్ పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. తాజాగా మిచెల్ స్టార్క్ కామెంట్సే దీనికి ఉదాహరణ.. . యాషెస్ కంటే భారత్తో సిరీసే తమకు చాలా ముఖ్యమని స్టార్క్ వ్యాఖ్యానించాడు. భారత్, ఆసీస్ మధ్య ఐదు టెస్టులు జరుగుతుండడంతో అది యాషెస్ రేంజ్ ను మించిపోతోందని చెప్పుకొచ్చాడు. టీమిండియా చాలా బలమైన జట్టని ఒప్పుకున్న స్టార్క్ వాళ్లను ఓడించడంలోనే అసలైన కిక్ ఉంటుందన్నాడు.