India vs Pakistan: వన్డే ప్రపంచ కప్ 2023 సమరం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. భారత్ వేదికగా అక్టోబర్ 5న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌పై అభిమానుల దృష్టి నెలకొంది. అయితే మ్యాచ్ జరిగే వేదిక అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన ఛార్జీలతో పాటు అక్కడి హోటల్ రూమ్స్, ఇతర సేవల ధరలు భారీగా పెరిగాయి. తాజా నివేదికల ప్రకారం, ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లాలంటే విమాన ఛార్జీలకు 415% ఎక్కువ ధర చెల్లించాలి.
దీంతో ఫ్యాన్స్ ఈ ఖర్చుల భారంతో ఆందోళన చెందుతున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వెళ్లే సర్వీసులపై విమానయాన సంస్థలు 106% నుంచి 415% అదనపు ఛార్జీ విధించే అవకాశం ఉంది. కొన్ని రోజులుగా వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్‌కి విమానాలు పెరిగాయి. ఒక రౌండ్ ట్రిప్ కోసం మ్యాగ్జిమం రూ.43,000 ఖర్చు అవుతుంది. హోటల్ గదుల ధరల పెరుగుదలను పరిగణనలోకి తీసుకుంటే, విమాన ఛార్జీలు పెరగడం ఖాయం అని సిటీ ట్రావెల్ ఆపరేటర్ ఒకరు మీడియాకు చెప్పారు. వేరే ఏ ఇతర వరల్డ్ కప్ మ్యాచ్‌కు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ లేకపోవడం గమనార్హం. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ జరిగే నాడు ఫ్లైట్ సర్వీస్‌ల ధరలు పరిశీలిస్తే.. సెప్టెంబర్ 20న టికెట్లు బుక్ చేస్తే చండీగఢ్ నుంచి అహ్మదాబాద్‌కి ఒక రౌండ్ ట్రిప్ ధర రూ. 43,833గా ఉంది.
హైదరాబాద్ నుంచి ఒక రౌండ్ ట్రిప్ ధర సుమారు రూ.40,000. అయితే ఇతర నగరాల నుంచి ఒక రౌండ్ ట్రిప్‌కు సగటున రూ.20,000 కాస్త ఎక్కువ ఉన్నాయి. కాగా, టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగోసారి. 2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో మొత్తం 10 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.