టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచి సంబరాల్లో మునిగితేలుతున్న భారత క్రికెట్ జట్టుకు అనుకోని కష్టాలు వచ్చి పడ్డాయి. వెస్టిండీస్ లో తుపాను ముప్పు ఉండడంతో ఎయిర్ పోర్టును మూసేశారు. అన్ని విమానాలు రద్దయ్యాయి. ఫలితంగా టీమిండియా క్రికెటర్లు మరోరోజు అక్కడే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే భారీ వర్షాల కారణంగా బయట తిరిగేందుకు కూడా లేకపోవడంతో ఆటగాళ్ళంతా హోటల్ రూమ్స్ కే పరిమితమయ్యారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా హోటల్ లో భోజనం పేపర్ ప్లేట్స్ లో తినాల్సిన పరిస్థితి నెలకొంది.
సిబ్బంది, ఇతర సమస్యల కారణంగా ఆటగాళ్ళంతా క్యూ లై్ లో నిలబడి పేపర్ ప్లేట్లలో తింటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ తరహా వాతావరణం కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో టీమిండియా ఆటగాళ్ల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం తగ్గే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కాగా వీలైనంత త్వరగా భారత ఆటగాళ్లను స్వదేశం తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.