Ajinkya Rahane: అజింక్య రహానేకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో (WTC) చోటు దక్కింది. దీంతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. చెన్నై తరపున ఐపీఎల్‌లో (IPL)లో దుమ్మురేపుతుండటంతోనే రహానేకి పిలిచి మరీ అవకాశం ఇచ్చారని తెగ ఊదరగొట్టేస్తున్నారు. కానీ రహానే (Rahane) ఎంపికకు ఐపీఎల్ ఏ మాత్రం కారణం కాదు.
ఈ ఐపీఎల్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఆటగాడు అజింక్య రహానే. అసలు ఐపీఎల్‌లో రహానేను చెన్నై టీమ్ తీసుకున్నప్పుడే అందరూ వింతగా చూశారు. కానీ అంచనాలు తలకిందులు చేస్తూ దుమ్మురేపుతున్నాడు రహానే. ఈ సంవత్సరం రహానే స్ట్టైక్‌రేట్ 199. ఈ సీజన్‌లో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ అతనిదే. సగటున 52పరుగులు చేశాడు. ఓ రకంగా ఇప్పుడు చూస్తోంది రహానే 2.0ను. ఈ కారణంతోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో రహానేకు అవకాశం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఇది నిజం కాదంటున్నారు విశ్లేషకులు. దాదాపు 15 నెలల తర్వాత రహానే టెస్ట్ టీమ్‌లోకి వచ్చాడు. నిజానికి రహానే (Ajinkya Rahane) కూడా దీన్ని నమ్మలేడేమో. అసలు ఐపీఎల్‌లో రహానే ఆటకు, జాతీయ జట్టు ఎంపికకు సంబంధం లేదు. ఐదు మ్యాచ్‌ల్లో బ్యాట్‌కు పనిచెప్పినంత మాత్రాన సెలక్టర్లు టెస్ట్ (Test) ఫార్మాట్‌లో రహానేకు అవకాశం ఇచ్చారనుకోవడం సరికాదు.
మరి రహానేకు అవకాశం ఎలా దక్కింది?
ఒకటి రహానే అనుభవం.. రెండోది ఫస్ట్ ఛాయిస్ క్రికెటర్లకు గాయాల బెడద. జట్టులో బాగా కుదురుకున్న శ్రేయస్ అయ్యర్‌కు ఇటీవల సర్జరీ జరిగింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ నాటికి కోలుకుంటాడన్న నమ్మకం లేదు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ఎఫెక్ట్ కూడా రహానే ఎంపికపై ఉంది. పంత్ ఉండి ఉంటే మిడిల్ ఆర్డర్ బలంగా ఉండేది. ఇప్పుడు పంత్ లేకపోవడం, శ్రేయస్ అయ్యర్ కూడా దూరం కావడంతో మిడిల్ ఆర్డర్‌లో అనుభవం కలిగిన ఆటగాడి అవసరం ఏర్పడింది. ఇంగ్లండ్ పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటం అతడికి కలసివచ్చింది.
పంత్ స్థానంలో భరత్‌ను తీసుకున్నా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కె.ఎల్.రాహుల్‌ను తీసుకున్నా అతడు కూడా ఫామ్‌లో లేడు. జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్ ముగ్గురూ నమ్మదగ్గ ఆటగాళ్లుగా మారిపోయారు. అయితే ఈ ముగ్గురూ ఒవెల్‌లో ఫైనల్ ఆడే అవకాశం లేదు. వీరిలో ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. రహానే బదులు మయాంక్ అగర్వాల్‌ను ఎంచుకుందామా అంటే ఆ పరిస్థితి లేదు. నిజానికి రహానే కంటే రంజీల్లో మయాంక్‌కు మంచి రికార్డులున్నాయి. కానీ దూరంగా వెళ్లే బంతులను వెంటాడే లక్షణం అతడిని దెబ్బతీసింది. ఇక సర్ఫరాజ్‌ఖాన్, సూర్యకుమార్ యాదవ్‌ను ట్రై చేసే అవకాశం లేదు. సూర్య పూర్తిగా ఫామ్‌ను కోల్పోయాడు. అలాగే సర్ఫ్‌రాజ్‌ఖాన్‌కు ఇప్పటిదాకా అవకాశం ఇవ్వలేదు.
దీంతో కీలకమైన టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అతడికి అవకాశం ఇవ్వడం కష్టమే. ఆసీస్‌తో (Australia) స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆడించి ఉంటే అది ప్లస్ అయ్యేది. పాట్ కమిన్స్, జోష్ హేజల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి ఆసీస్ స్పీడ్‌స్టర్లను ఎదుర్కోవాలంటే అనుభవమున్న ఆటగాళ్లే కావాలని బీసీసీఐ(BCCI) భావించింది.
మరి రెహానే చేరికతో జట్టు కష్టాలన్నీ తొలగిపోయినట్లేనా అంటే లేదనే చెప్పాలి. చాలా సమస్యలున్నాయి. కానీ మిడిల్ ఆర్డర్‌లో రహానే ఉంటే కొంతమేర ప్రయోజనం ఉంటుందని భావించి అతడిని జట్టులోకి తీసుకున్నారు. రహానే 2022 జనవరిలో సౌతాఫ్రికాతో చివరి టెస్ట్ ఆడాడు. ఫామ్ కోల్పోవడంతో జట్టులో చోటు దూరమైంది. అయితే రంజీల్లో తన సత్తా చాటి మళ్లీ ఫామ్‌ను అందుకున్నాడు రహానే.