Ajit Agarkar: ఐదుగురిలో ఒకరు నాన్ ఇంటర్నేషనల్ ప్లేయర్ అగార్కర్ కొలీగ్స్ అన్ ఫిట్

భారత పురుషుల జట్టుకు కొత్త చీఫ్ సెలెక్టర్ లభించారు. ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీకి భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ చైర్మన్ అయ్యారు. ఈ సెలక్షన్ కమిటీలో చైర్మన్ అజిత్ అగార్కర్‌తో పాటు శివ సుందర్ దాస్, సుబ్రొతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ ఉన్నారు.

  • Written By:
  • Publish Date - July 6, 2023 / 04:00 PM IST

ఈ అనుభవజ్ఞులు రాబోయే కాలంలో చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ ఐదుగురు దిగ్గజాలు రాబోయే ఆసియా కప్, ప్రపంచకప్ వంటి భారీ టోర్నీలకు టీమిండియాను ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో పాటు జట్టుకు కొత్త కెప్టెన్ గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఓడిపోవడంతో.. భారత టెస్టు కెప్టెన్‌ని మార్చాలనే డిమాండ్ ఊపందుకుంది. దీంతో పాటు టీమ్ ఇండియా కొత్త టీ20 కెప్టెన్ వైపు కూడా చూస్తోంది. అదే సమయంలో, ఈ ప్రపంచకప్ తర్వాత, టీమిండియా కూడా ప్రధాన కెప్టెన్ రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయాన్ని కనుగొనవలసి ఉంటుంది.

సెలక్షన్ కమిటీ కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ 1998లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. చేతన్ శర్మ తర్వాత శివ సుందర్ దాస్ తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2000లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన శివ సుందర్ దాస్ తన కెరీర్‌లో 23 టెస్టులు, 4 వన్డేలు ఆడాడు.

1991లో టీమిండియాకు అరంగేట్రం చేసిన సుబ్రొతో బెనర్జీ అంతర్జాతీయ కెరీర్‌ అంత గొప్పగా ఏంలేదు. అతను తన కెరీర్‌లో 1 టెస్ట్, 6 వన్డేలు ఆడాడు. సలీల్ అంకోలా 1989లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను తన కెరీర్‌లో 1 టెస్ట్, 20 వన్డేలు ఆడాడు. సెలక్షన్ కమిటీలో అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఏకైక సభ్యుడు శ్రీధరన్ శరత్. శ్రీధరన్ తమిళనాడు తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడేవాడు. అతను తన కెరీర్‌లో మొత్తం 139 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. అగార్కర్ రాక ముందు ఈ నలుగురు టీమిండియా పాలిట శనిలా దాపురించారంటూ ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేశారు. ఇకనైనా వీరి పద్ధతి మార్చుకుని, అగార్కర్ తో కలిసి ముందుకు సాగి, ఐసీసీ ఈవెంట్లలో టీమిండియాను విజయాల బాట పట్టించాలని కోరుతున్నారు.