ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాట్ తో దుమ్మురేపుతున్నాడు ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో 542 పరుగులు చేయాగా.. అతడి యావరేజ్ 67గా ఉంది. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు కోహ్లీ ఇలా ఫుల్ ఫామ్ లోకి రావడం టీమిండియా (Team India) కు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. అయితే ఐపీఎల్లో కోహ్లీ స్ట్రైక్ రేట్ పై భారీగా విమర్శలు వచ్చాయి. సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సహా పలువురు సీనియర్లు సీరియస్ అవుతున్నారు. ఇంత స్లోగా ఆడటం కరెక్ట్ కాదని.. స్పిన్నర్లను కూడా విరాట్ సరిగ్గా ఎదుర్కోవడం లేదని అంటున్నారు.
ఈ విమర్శలపై పాకిస్థాన్ లెజెండ్ వసీం అక్రమ్ రియాక్ట్ అయ్యాడు. కోహ్లీని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారన్నాడు. ఇంత బాగా ఆడుతున్నప్పటికీ అతన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నాడు. అతడి మీద బురద చల్లుతున్న వాళ్లంతా ఒకటి అర్థం చేసుకోవాలనీ, క్రికెట్ అనేది సమష్టిగా ఆడే ఆటనీ, ఇక్కడ ఒక్క ప్లేయర్ బాగా ఆడితే సరిపోదన్నాడు. ఒక్కడే మ్యాచ్ లు గెలిపించలేడనీ, విరాట్ కెప్టెన్ గా ఉన్నప్పుడూ ఒత్తిడిలోనే ఉన్నాడనీ గుర్తు చేశాడు. ఇప్పుడు కూడా అతడి మీద ఒత్తిడి ఉందన్న అక్రమ్. అతడు బాగానే ఆడుతున్నాడనీ కితాబిచ్చాడు. అతడ్ని అనవసరంగా టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డాడు.