Ashwin: అవమానం గుర్తుంది.. రివెంజ్ అదిరింది

ఒక ప్లేయర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా.. సడెన్‌గా అతన్ని పక్కన పెట్టేస్తే? టీం మేనేజ్‌మెంట్‌పై కోపం వస్తుంది కదా. తమను టీంలోకి తీసుకోలేదని సెలెక్టర్లనే కొందరు కుర్రాళ్లు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 16, 2023 / 04:00 PM IST

అలాంటిది ప్రపంచ నెంబర్ వన్ బౌలర్‌ను పక్కన పెట్టేస్తే.. అతను సైలెంట్‌గా ఉంటాడా? సాధారణంగా అయితే ఉండడేమో.. కానీ అశ్విన్ మామూలోడు కాదు కదా. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా మేనేజ్‌మెంట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అశ్విన్‌ను ఆడించలేదు. ఈ నిర్ణయం విన్న చాలా మంది మాజీలు మండిపడ్డారు. అసలు టీం మేనేజ్‌మెంట్‌కు బుర్ర ఉందా? అంటూ తిట్టిపోశారు. కానీ అశ్విన్ మాత్రం ఎవర్నీ ఏమీ అనలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే 12 వికెట్లతో చెలరేగాడు. విండీస్‌పై భారత్ గెలుపులో అతని పాత్రే ముఖ్యం. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా వెల్లడించాడు.

అశ్విన్ ఒక ఛాంపియన్ ప్లేయర్ అని మెచ్చుకున్న ఓఝా.. ‘ఒక ఛాంపియన్ ప్లేయర్‌కు అతనికి దక్కాల్సిన గౌరవం దక్కలేదనుకోండి, అతనికి ఇవ్వాల్సింది ఇవ్వలేదనుకోండి.. వాళ్లు తమ అసహనాన్ని కూడా భిన్నంగా చూపిస్తారు. అశ్విన్ అలాంటి వాడే. డబ్ల్యూటీసీలో ఆడించలేదు. ఆ తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే తను ఎందుకు నెంబర్ వన్ స్పిన్నరో అర్థమయ్యేలా చేశాడు’ అని ఓఝా అన్నాడు. తనకు జరిగిన అవమానం గురించి అశ్విన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదని గుర్తుచేశాడు. తన ప్రదర్శనతోనే అందరికీ తన సమాధానం ఇచ్చాడన్నాడు.

టీమిండియా మాజీ సెలెక్టర్ సాబా కరీం కూడా అశ్విన్ ప్రదర్శనను తెగ మెచ్చుకున్నాడు. అశ్విన్ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాడని, విండీస్‌తో టెస్టులో కూడా అతను అదే చేశాడని సాబా కరీం కొనియాడాడు. ప్రత్యర్థి బ్యాటర్ల బలహీనతను చాలా త్వరగా పట్టేశాడని, దానికి తగ్గట్లే బౌలింగ్ చేశాడని చెప్పాడు.