అదరగొట్టావయ్యా అమన్ కాంస్యం గెలిచిన యువ రెజ్లర్

  • Written By:
  • Publish Date - August 10, 2024 / 02:18 PM IST

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌ మరో పతకం సాధించింది. పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో భారత్‌ రెజ్లర్ అమన్ సెహ్రావత్ ప్యూర్టోరికో రెజ్లర్ క్రూజ్ పై 13-5తేడాతో విజయం సాధించాడు. బౌట్‌లోకి దిగినప్పటి నుంచే సెహ్రావత్ సత్తా చాటాడు. తన పట్టు ఏంటో మరోసారి నిరూపించాడు. హరియాణాకు చెందిన అమన్ సెహ్రావత్ తాను పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లోనే కాంస్య పతకం సాధించి భారత్‌ను సగర్వంగా అంతర్జాతీయ వేదికపై నిలబెట్టాడు. ఇక 21 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పాల్గొని 57 కేజీల పురుషుల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించాడు. తద్వారా ఒలింపిక్ మెడల్ గెలిచిన పిన్న వయ్సస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పివి సింధు పేరిట ఉండేది.
కాగా ఈ ఒలింపిక్స్ కు ముందు అమన్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. కుస్తీ పోటీలను రెగ్యులర్ ఫాలో అయ్యే ఫ్యాన్స్ కు మాత్రం అతనిపై అంచనాలున్నాయి. అండర్ 23 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా అమన్ గుర్తింపు పొందాడు. దీంతోనే ఈ యువ రెజ్లర్ వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు ఒలింపిక్స్ లో కాంస్యం సాధించి అదరగొట్టాడు. కాగా అమన్ మెడల్ తో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది.