టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్న టీమిండియా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్… భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా మరో మెడల్ రేసులో నిలిచారు. ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ కోసం పోటీపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గుర్బాజ్ కూడా వీరిద్దరితో పాటు రేసులో ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ అదరగొట్టాడు. వరల్డ్ కప్ అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 156.7 స్ట్రైక్ రేట్ తో 257 పరుగులు చేశాడు.
మరోవైపు భారత పేసర్ జస్ప్రీత్ బూమ్రా పదునైన బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. టోర్నీలో అత్యధిక వికెట్ల జాబితాలో టాప్ ప్లేస్ సాధించడమే కాదు బెస్ట్ ఎకానమీ బౌలర్ గానూ నిలిచాడు. ముఖ్యంగా ఫైనల్లో సఫారీలను తనదైన పేస్ తో కంగారుపెట్టాడు. 4.17 ఎకానమీతో టోర్నీలో 15 వికెట్లు పడగొట్టిన బూమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గానూ ఎంపికయ్యాడు. ఇక ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ గుర్బాజ్ 281 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆఫ్ఘన్ జట్టు తొలిసారి వరల్డ్ కప్ సెమీస్ కు చేరడంలో గుర్బాజ్ దే కీ రోల్. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మంత్ మెడల్ ను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.