బీసీసీఐ (BCCI) ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో టీమిండియా వెటరన్స్ చతేశ్వర్ పుజారా, శిఖర్ ధవన్(Shikhar Dhawan), ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) చోటు కోల్పోయారు. వీరిలో పుజారా ఒక్కడు దేశవాలీ ఇతరత్రా టోర్నీల్లో యాక్టివ్‌గా ఉంటూ మరోసారి టీమిండియా తలుపులు తట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఉమేశ్ దేశవాలీ క్రికెట్ (Umesh Deshwali Cricket) లో అప్పుడప్పుడూ కనిపిస్తున్నాడు. శిఖర్ ధావన్ అయితే కేవలం ఐపీఎల్ కోసమే అతను గేమ్‌లో కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు మరో వెటరన్ అజింక్య రహానేను కూడా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ విషయంలో పరిగణలోకి తీసుకోలేదు.
ఈ నలుగురిలో ఒక్క పుజారా మినహా మిగతా ముగ్గురి విషయంలో బీసీసీఐ కరెక్ట్‌గానే వ్యవహరించిందనుకోవచ్చు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోతే వీరి కెరీర్‌లు ఖతమైనట్లేనా..? ఈ నలుగురు తిరిగి పుంజుకుని టీమిండియాలో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉందా..? ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రశ్నలకు నో అనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే టీమిండియాలో ఈ నలుగురి పాత్రలకు న్యాయం చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అదే సమయంలో ఈ నలుగురూ ఫిట్ నెస్, వయసు దృష్ఠిలో పెట్టుకుంటే ఇక రిటైర్మెంట్ ప్రకటనే మిగిలిందని పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.