Usman Khawaja: కొంపముంచిన నోబాల్.. అడ్డేలేని ఖవాజా ఖలేజా

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో ఇంగ్లండ్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తే.. ఆస్ట్రేలియా సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది.

  • Written By:
  • Publish Date - June 18, 2023 / 03:29 PM IST

ఉస్మాన్‌ ఖవాజా సెంచరీతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 311 పరుగులకు 5 వికెట్లతో మెరుగైన స్థితిలో నిలిచింది. చేతిలో 5 వికెట్లు ఉన్న ఆ జట్టు ఇంకా 82 పరుగులు వెనుకబడి ఉంది. అయితే ఇంగ్లండ్ వెటరన్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన ఘోర తప్పిదం ఇంగ్లండ్ కొంపముంచగా.. ఆసీస్ భారీ ఇన్నింగ్స్‌కు బాటలు వేసింది. క్రికెట్‌లో నోబాల్ వేయడం పెద్ద క్రైమ్‌గా భావిస్తారు. అలాంటి ఘోర తప్పిదమే బ్రాడ్ చేశాడు. అది కూడా సెంచరీ హీరో వికెట్ టేకింగ్ డెలివరీని నోబాల్‌గా వేసి మూల్యం చెల్లించుకున్నాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 81 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ రెండో బంతిని బ్రాడ్ అద్భుత ఇన్‌ స్వింగర్‌గా వేయగా.. ఖవాజా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతిని ఏ మాత్రం అంచనా వేయకపోవడంతో ఖవాజా మిడిల్ స్టంప్‌ను బంతి గీరాటేసింది. ఈ వికెట్‌తో ఇంగ్లండ్ ఆటగాళ్లు మ్యాచ్ గెలిచినంత సంబరాలు చేసుకోగా.. ఖవాజా నిరాశగా పెవిలియన్ వైపు నడిచాడు. కానీ అప్పుడు అంపైర్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. నోబాల్ అని సిగ్నల్ ఇవ్వడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా స్టువర్ట్ బ్రాడ్ బాధ వర్ణాతీతం. అతను అంపైర్‌తో వాదించినా ఫలితం లేకపోయింది. రిప్లేలో లైన్ ధాటినట్లు స్పష్టంగా కనిపిచింది. ఈ అవకాశంతో ఖవాజా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటికీ ఆసీస్ స్కోర్ 264 పరుగులకు 5 వికెట్లు కోల్పోగా.. ఉస్మాన్ ఖవాజా 112 పరుగులు మాత్రమే చేశాడు. ఒకవేళ ఈ వికెట్ గనుక పడి ఉంటే ఆసీస్ 300లోపే ఆలౌటయ్యేది.