అశ్విన్ సడన్ రిటైర్మెంట్, అసలు విలన్ అతనేనా ?

భారత క్రికెట్ లో అద్భుతమైన స్పిన్నర్ గా దాదాపు 14 ఏళ్ళ పాటు అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ టూర్ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికేశాడు. అతనికి సరైన వీడ్కోలు మ్యాచ్ గౌరవం కూడా దక్కలేదన్న విమర్శలూ వచ్చాయి.

  • Written By:
  • Publish Date - December 20, 2024 / 08:49 PM IST

భారత క్రికెట్ లో అద్భుతమైన స్పిన్నర్ గా దాదాపు 14 ఏళ్ళ పాటు అదరగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ఆసీస్ టూర్ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికేశాడు. అతనికి సరైన వీడ్కోలు మ్యాచ్ గౌరవం కూడా దక్కలేదన్న విమర్శలూ వచ్చాయి. ఓవరాల్ గా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించిన తీరును చూస్తే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇంత సడెన్‌గా అశ్విన్ రిటైర్మెంట్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. అశ్విన్ రిటైర్మెంట్ వెనుక అసలైన విలన్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీరేనంటూ అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడంతోనే అశ్విన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడిందనే వాదన వినిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకొచ్చి గంభీర్.. అశ్విన్‌కు చెక్ పెట్టాడని, మిగిలిన సీనియర్ ఆటగాళ్లు కూడా అశ్విన్ బాటలో నడిచే సమయం ఎంతో దూరంలో లేదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో అశ్విన్ తడబడగా.. గంభీర్ సడన్‌గా వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకొచ్చాడు. అతను వచ్చిన అవకాశాలను అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్‌కు బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండటంతో అశ్విన్‌ వెనకబడిపోయాడు.

పెర్త్ టెస్ట్ వేదికగా అశ్విన్, జడేజాలను కాదని సుందర్‌కు అవకాశం ఇచ్చారు. తద్వారా అశ్విన్‌ స్థానాన్ని సుందర్ భర్తీ చేయగలడనే సంకేతాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్ ఇచ్చింది. పింక్ బాల్‌ టెస్ట్‌లో అశ్విన్‌కు అవకాశం కల్పించినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మూడో టెస్ట్‌లో అతని స్థానంలో వచ్చిన జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు ఓటమి తప్పించాడు. ఈ ప్రదర్శనతో చివరి రెండు టెస్ట్‌ల్లో జడేజాను పక్కనపెట్టలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇప్పట్లో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లు లేవు. వచ్చే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌.. ఇంగ్లండ్ పర్యటనతో ప్రారంభం కానుంది. అప్పటి వరకు భారత జట్టుకు దూరంగా ఉండి మళ్లీ ఎంపికవ్వలేని పరిస్థితి తెచ్చుకోవడం కంటే జట్టులో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని అశ్విన్ భావించినట్లు అర్థమవుతోంది. అయితే బీసీసీఐ అతినికి ఫేర్ వెల్ ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు.