Asia Cup: ఆసియా కప్ వేదికలు మారుతాయా..? వర్షాల కారణంగా ఏసీసీ కీలక నిర్ణయం..!

ఇండియా-నేపాల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకిగా మారుతుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధాని కొలంబోతోపాటు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - September 3, 2023 / 08:16 PM IST

Asia Cup: ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు వర్షాలు పెద్ద ఇబ్బందిగా మారాయి. క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియా-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరుదేశాల ఫ్యాన్స్ అసంతృప్తికి లోనయ్యారు. చాలా కాలంగా ఎదురు చూసిన ఈ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. మరికొన్ని మ్యాచులకు కూడా వర్షం గండం పొంచి ఉంది. ప్రస్తుతం ఆసియా కప్ జరుగుతున్న శ్రీలంకలో వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా ఇంకొన్ని మ్యాచులు కూడా వర్షం కారణంగా రద్దయ్యే అవకాశం ఉంది.

ఇండియా-నేపాల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకిగా మారుతుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజధాని కొలంబోతోపాటు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. లీగ్ మ్యాచులు పూర్తై, సూపర్ 4 మ్యాచ్‌లు జరిగేనాటికి వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరు వరకూ భారీ వర్షాలు కురవొచ్చు. ఈ నేపథ్యంలో ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) ముందు జాగ్రత్త చర్యలను తీసుకోనుంది. కొలంబో వేదికగా జరిగే సూపర్ 4, ఫైనల్ మ్యాచ్‌లన్నింటినీ మరో వేదికపైకి షిఫ్ట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే సూపర్ 4 మ్యాచ్‌లను పల్లెకెలె లేదా దంబుల్లా స్టేడియాలకు షిఫ్ట్ చేయాలని చూస్తోంది. ఈ నెల 9, 10, 12, 14, 15 తేదీల్లో సూపర్ 4 మ్యాచ్‌లతోపాటు, 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులన్నింటినీ మార్చాలని ఏసీసీ భావిస్తోంది.
ఇండియా మ్యాచ్‌కు మరోసారి వర్షం ముప్పు
పాకిస్తాన్‌తో జరిగిన ఇండియా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా.. ఇప్పుడు నేపాల్‌తో జరగబోయ మ్యాచ్ కూడా కూడా రద్దయ్యే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్ రద్దవడం వల్ల ఇండియా ఒకే పాయింట్ సాధించింది. పాక్, ఇండియాకు చెరో పాయింట్ వచ్చింది. నేపాల్‌తో మ్యాచ్ రద్దైనా కూడా.. ఇండియాకు ఒకే పాయింట్ వస్తుంది. దీంతో ఇండియాకు రెండు పాయింట్లే వస్తాయి. నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇండియా సూపర్-4లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే పాక్ సూపర్-4కు ఎంటర్ అయింది. ఇండియా, పాక్ సూపర్-4కు ఎంటరైతే.. మరోసారి ఈ నెల 10న ఇండియా-పాక్ మ్యాచ్ చూడొచ్చు.