Matthew Hayden: అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ వేదికగా ప్రపంచకప్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇక సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఆడటం రోహిత్ సేనకు సానుకూలాంశం. అయితే, అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఉండటం సహజం. ఈ నేపథ్యంలో సమతూకమైన జట్టుతో బరిలోకి దిగి, సరైన సమయంలో రాణిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదు. పుష్కరకాలం తర్వాత మరోసారి స్వదేశంలో ప్రపంచ విజేతగా నిలవగలదు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసే జట్టు సెలక్టర్లకు సవాలుగా మారింది.
ఇక ఆసియా కప్ ఈసారి.. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న తరుణంలో ఈ ఈవెంట్‌లో ఆడే జట్టే ప్రపంచకప్ ప్రొవిజినల్ టీమ్ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే చెప్పాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే చాలని ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. ఇండియాకు సంబంధించిన వరల్డ్ కప్ జుట్టులో ఎవరు ఉండాలనేదానిపై ఒక టీం సెలెక్ట్ చేశాడు మాథ్యూ హెడెన్. ఆయన డ్రీమ్ టీం ప్రకారం.. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ప్రధాన జట్టులో చోటిస్తే బాగుంటుందన్న ఈ మాజీ ఓపెనర్.. అంతర్జాతీయ వన్డేల్లో పేలవ రికార్డు ఉన్న భారత టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా తన జట్టుకు ఎంపిక చేయడం విశేషం.