Ashes Cup: టెస్ట్ ఛాంపియన్స్ అని చెప్పుకోకండ్రా ప్లీజ్

యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఆస్ట్రేలియానే విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. ఈ టెస్టు ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ బెయిర్‌ స్టో ఔటైన విధానం వివాదానికి దారితీసింది. దీంతో ఆసీస్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిందంటూ పలువురు మండిపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - July 3, 2023 / 01:29 PM IST

ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ కూడా ఆస్ట్రేలియా జట్టుపై తీవ్రంగా స్పందించాడు. ‘‘హే స్లెడ్జర్స్‌.. క్రీడా స్ఫూర్తి మీకు వర్తించదా..? కేవలం ఇండియన్స్‌కేనా?’’ అంటూ ట్విటర్‌లో గంభీర్‌ మండిపడ్డాడు. చివరి రోజు తొలి సెషన్‌ ఆటలో ఇంగ్లాండ్‌ 193/5గా ఉన్న సమయంలో.. గ్రీన్‌ బౌన్సర్‌ను తప్పించుకునేందుకు బెయిర్‌స్టో కిందకు వంగాడు. బంతి వికెట్‌ కీపర్‌ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఇంతలో ఓవర్‌ పూర్తయిందనే ఉద్దేశంతో బెయిర్‌స్టో క్రీజు దాటాడు. వెంటనే వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ బంతిని కింద నుంచి విసిరి స్టంప్స్‌ పడగొట్టాడు.

దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లందరూ అప్పీల్‌ చేయగా.. బెయిర్‌స్టో, స్టోక్స్‌తో పాటు ఇంగ్లాండ్‌ క్రికెటర్లు, స్టాండ్స్‌లోని అభిమానులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. బెయిర్‌స్టో పరుగు తీసేందుకు ప్రయత్నించలేదు కాబట్టి మూడో అంపైర్‌ ఎరాస్మస్‌ నాటౌట్‌ అంటాడేమోనని అనుకున్నారు. కానీ బంతి డెడ్‌ కాలేదని భావించి బెయిర్‌స్టోను అతడు స్టంపౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆస్ట్రేలియా సంబరాల్లో తేలిపోగా.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు షాక్‌లో మునిగిపోయారు. ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌తో బెయిర్‌స్టో, మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్‌ స్టోక్స్‌ మాట్లాడినా ఫలితం లేకపోయింది.

ఈ ఘటన అనంతరం స్టేడియంలోని ఇంగ్లాండ్‌ అభిమానులు ఆస్ట్రేలియాపై విమర్శలు చేస్తూ కేకలు వేశారు. ‘’ఇది పాత ఆసీస్‌ జట్టే.. ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటుంది’’ అని నినాదాలు చేస్తూ గతంలో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన ఘటనను వారు గుర్తు చేశారు. అయితే దీనికి ప్రతివిమర్శలు చేస్తూ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 2019 సంఘటనను గుర్తు చేసాడు. కీపర్‌గా జానీ బెయిర్ స్టో కూడా గతంలో ఇలా స్టంపౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి రోజు డేవిడ్ వార్నర్‌ను ఇలానే ఔట్ చేసేందుకు ప్రయత్నించాడు. 2019లో స్టీవ్ స్మిత్‌ను ఇలానే పెవిలియన్‌కు చేర్చాడు. బ్యాటర్లు క్రీజు ధాటితే ఔట్ చేయడం కీపర్లు సర్వసాధారణం. అలెక్స్ క్యారీ‌దే పూర్తి క్రెడిట్. అతనికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అయినా అంపైర్లే ఔటిచ్చారు కదా?’అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.