Australia: స్పిన్నర్ లేకుండానే నాలుగో టెస్టు.. అందుకే ఆసీస్ నంబర్ వన్ జట్టు

లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అతను ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి రాలేదు. కానీ చివర్లో జట్టుకు అవసరం అని తెలిసి బ్యాటింగ్‌కు వచ్చాడు.

  • Written By:
  • Publish Date - July 19, 2023 / 04:00 PM IST

ఇక హెడింగ్లే టెస్టులో టాడ్ మర్ఫీని ఆడించారు. కానీ అతను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో ఈ ఆసీస్ టీం మేనేజ్‌మెంట్ బోల్డ్ డెసిషన్ తీసుకుంది. ఈ క్రమంలోనే నాలుగో టెస్టు ఆడే పదకొండు మంది సభ్యుల పేర్లను ఒక రోజు ముందుగానే ప్రకటించింది. ఈ టీంలో ఒక్క ప్రధాన స్పిన్నర్ కూడా లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇలా స్పిన్నర్ లేకుండా ఆసీస్ జట్టు బరిలో దిగడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

అయితే జట్టులో ప్రధాన స్పిన్నర్ అంటూ ఎవరూ లేకపోయినా.. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ రూపంలో ఆ టీంలో ఇద్దరు పార్ట్ టైమ్ స్పిన్నర్లు ఉన్నారు. ఈ మ్యాచ్ జరగనున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పూర్తిగా పేస్ బౌలింగ్‌కు సహకరించే అవకాశాలు ఉన్నాయి. దానికితోడు ఇక్కడ వర్షం పడే అవకాశం ఉంది. దీంతో స్పిన్నర్లు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని ఆసీస్ టీం భావిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మూడో టెస్టులో అనూహ్యంగా ఆసీస్ ఓడినప్పటికీ ప్రస్తుతం ఈ సిరీస్‌లో 2-1తో ఆసీస్ ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో ఆడే జట్టులో ఆస్ట్రేలియా రెండు మార్పులు చేసింది. పేసర్ స్కాట్ బోలాండ్, స్పిన్నర్ టాడ్ మర్ఫీని పక్కన పెట్టింది. వీరి స్థానాల్లో స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్, యంగ్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. దీంతో మూడో టెస్టులో అద్భుతంగా రాణించిన మిచెల్ మార్ష్ కూడా జట్టులో కొనసాగనున్నాడు. ఇక ఆతిథ్య ఇంగ్లండ్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయింది. ఇంగ్లండ్ ఇటీవలే ప్రకటించిన తుది జట్టులో కూడా ప్రధాన స్పిన్నర్ ఎవరూ లేకపోవడం గమనార్హం. కాకపోతే మొయిన్ అలీ రూపంలో ఇంగ్లండ్ జట్టులో మంచి స్పిన్ ఆల్ రౌండర్ ఉన్నాడు. అవసరమైతే జో రూట్ కూడా తన స్పిన్‌తో సహకారం అందిస్తాడు.