David Warner: వార్నర్ 25 వరల్డ్ ఫేమస్ పార్ట్నర్

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లు.. మరికొన్ని రోజుల్లో టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలుకనున్నట్లు ముందే ప్రకటించిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. అరుదైన రికార్డు తన పేరిట రాసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 03:00 PM IST

ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్.. టెస్టు క్రికెట్ లో అరుదైన ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వార్నర్ అజేయ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ లో తొలి వికెట్ కు అద్యధిక సార్లు సెంచరీ పార్ట్ నర్ షిప్ లు నెలకొల్పిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కాడు. ఓవల్ టెస్టులో సెంచరీ చేయడం ద్వారా.. వార్నర్ 25వ సారి శతక భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు.

టెస్టు క్రికెట్ లో ఇదే అత్యధికం కాగా.. గతంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జాక్ హబ్స్ 24 సార్లు సెంచురీ భాగస్వామ్యాల పేరిట ఉన్న రికార్డును వార్నర్ అధిగమించాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ అలిస్టర్ కుక్ కూడా 24 సార్లు ఈ ఘనత సాధించారు. టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టెస్టుల్లో 23 సార్లు శతక భాగస్వామ్యాల్లో పాలుపంచుకొని ఈ జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్ లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న వార్నర్.. చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడాడు. వచ్చే ఏడాది స్వేదశంలో పాకిస్థాన్ తో సిరీస్ అనంతరం టెస్టులకు దూరం కానున్నట్లు వార్నర్ గతంలోనే ప్రకటించాడు. సిడ్నీలో తన చివరి సంప్రదాయ మ్యాచ్ ఆడాలని అనుకుంటున్నట్లు వెల్లడించాడు.