Ali Bacher: లారా కంటే సచినే బెస్ట్.. సఫారీ మాజీ కెప్టెన్ కామెంట్స్

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌, దిగ్గజం అలీ బచర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లారా కంటే సచిన్ అత్యుత్తమం అని చెప్పాడు. సచిన్‌ ఓ అద్భుతమని, అతడు వేరే ప్లానెట్‌ నుంచి వచ్చాడా అనిపిస్తుందన్నాడు. సచిన్ ఆడిన చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు తాను ఆస్వాదించానని గుర్తు చేసుకున్నాడు.

  • Written By:
  • Publish Date - January 1, 2024 / 06:50 PM IST

Ali Bacher: ప్రపంచ క్రికెట్‌లో సచిన్, లారా.. ఇద్దరూ ఇద్దరే. వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎక్కువ శాతం మంది సచిన్ బెస్ట్ అని చెబుతారు. అయితే ఆసీస్ ఫాన్స్‌కు మాత్రం లారానే బెస్ట్‌గా కనిపిస్తాడు. ఇదే విషయంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌, దిగ్గజం అలీ బచర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లారా కంటే సచిన్ అత్యుత్తమం అని చెప్పాడు. సచిన్‌ ఓ అద్భుతమని, అతడు వేరే ప్లానెట్‌ నుంచి వచ్చాడా అనిపిస్తుందన్నాడు.

DAVID WARNER: టెస్టులకే కాదు వన్డేలకూ గుడ్‌బై.. డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం

సచిన్ ఆడిన చాలా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు తాను ఆస్వాదించానని గుర్తు చేసుకున్నాడు. వ్యక్తిగతంగానూ టెండూల్కర్ ఎంతో గొప్ప వాడని, ఎప్పుడూ మైదానంలో అతడు వాగ్వాదం చేయడం చూడలేదని చెప్పాడు. ఆస్ట్రేలియా అభిమానులు సచిన్‌ కంటే లారా ఉత్తమమని భావిస్తుంటారనీ, తన వరకు అవన్నీ చెత్తమాటలన్నాడు. ఎందుకంటే లారా కేవలం 40 లక్షల మంది ముందు మాత్రమే మ్యాచ్‌లు ఆడాడనీ, సచిన్‌ 140 కోట్ల మంది అభిమానుల కోసం భారత్‌ తరఫున బరిలోకి దిగాడన్నాడు. ఇలాంటి సమయంలో ఒత్తిడి ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఆడేవారికే తెలుస్తుందన్నాడు. అందుకే లారా కంటే సచిన్ ఉత్తమమని తేల్చేశాడు. సచిన్‌, లారా దాదాపు ఒకే సమయంలో క్రికెట్‌లోకి అడుగుపెట్టారు.

లారా త్వరగానే కెరీర్‌ను ముగించగా.. సచిన్‌ మాత్రం రెండు దశాబ్దాలకుపైగా క్రికెట్‌ను శాసించాడు. మాస్టర్ బ్లాస్టర్ సాధించని రికార్డు లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు, టెస్టుల్లో 15 వేలకు పైగా పరుగులు, వన్డేల్లో 18 వేలకు పైగా పరుగులు చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యువ క్రికెటర్లకు సచిన్ స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు.