Babar Azam: ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఇంటి దారి పట్టింది. ఫైనల్‌కి వెళ్లాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచులో శ్రీలంకపై చివరి వరకు పోరాడి ఓడిపోయింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌కు చివరి బంతికి ఫలితం వచ్చింది. దీంతో ఫైనల్‌కి వెళ్ళాలనే పాకిస్థాన్‌కి నిరాశే ఎదురైంది. గెలుపోటములు ఆటలో భాగమే అయినా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఏడుపు మాత్రం అందరిని కలిచి వేసింది. ఈ టోర్నీకి ముందు పాకిస్థాన్.. ఆసియా కప్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది.
నేపాల్‌పై మ్యాచ్ గెలిచిన తర్వాత వన్డేల్లో నెంబర్ వన్‌గా అవతరించిన పాకిస్థాన్.. మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకెళ్లింది. సూపర్-4లో భాగంగా తొలి మ్యాచులో బంగ్లాదేశ్ మీద గ్రాండ్ విక్టరీ కొట్టి శుభారంభం చేసిన బాబర్ సేన.. ఆ తర్వాత పసికూన జట్టుని తలపించింది. భారత్‌పై భారీ తేడాతో ఓడిపోవడంతో పాటు కీలక ప్లేయర్లను దూరం చేసుకుంది. ఇక గురువారం గెలవాల్సిన మ్యాచులో ఫీల్డింగ్ తప్పిదాలతో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో బాబర్ తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోయాడు. చేయి అడ్డం పెట్టుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. ఇప్పటివరకు బాబర్ ఏడవడం చూడని క్రికెట్ ఫ్యాన్స్ ఈ స్టార్ ప్లేయర్ మీద సానుభూతి చూపిస్తన్నారు.