Babar Azam: ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్ వరుస పరాజయాలతో ఫైనల్‌కు చేరకుండానే ఇంటి దారి పట్టింది. సూపర్ 4లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్‌లో 228 పరుగుల భారీ తేడాతో పాక్ ఓడింది. ఇక ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన పోరులో ఆఖరి బంతికి పరాజయం పాలై ఇంటి దారి పట్టింది. ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ కేవలం బంగ్లాదేశ్, నేపాల్ లాంటి జట్లపై మాత్రమే విజయాలను నమోదు చేసింది.
ఇక శ్రీలంకతో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ప్లేయర్ల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీలంక చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్ బాబర్ ఆజమ్ డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. జట్టులో ఉన్న ప్రతి ఒక్కరు సూపర్ స్టార్స్ అవ్వడానికి తహతహలాడుతున్నారని.. ప్రపంచకప్‌లో కూడా ఇలాంటి ప్రదర్శనే చేస్తే ఎవరూ సూపర్ స్టార్స్ అవ్వలేరంటూ బాబర్ ఆజమ్ పాక్ ప్లేయర్ల ఆటతీరును గుర్తు చేస్తు వ్యాఖ్యలు చేశాడట. బాబర్ ఆజమ్ మాటలు నచ్చని షాహీన్ అఫ్రిది మధ్యలో అడ్డుతగిలి.. బాగా ఆడిన వారిని మొదట మెచ్చుకోవాలని కామెంట్స్ చేశాడట. దాంతో డ్రెస్సింగ్ రూం వాతావరణం ఒక్కసారిగా వేడిక్కిందట. మధ్యలో వికెట్ కీపర్ రిజ్వాన్ జోక్యం చేసుకుని గొడవ పెద్దది కాకుండా ఆపాడని తెలుస్తుంది.
అనంతరం సహచరులకు చెప్పకుండానే ఒంటరిగా బాబర్ ఆజమ్ పాకిస్తాన్‌కు వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. జట్టులో బాబర్ ఆజమ్ తీరును కొందరు ప్లేయర్లు తప్పుబడుతున్నట్లు తెలుస్తుంది. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తమ జట్టు ఆటతీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది.