ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 17వ సీజన్ నిర్వహణ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ సెకెండ్ ఫేజ్ మ్యాచ్‌ల వేదికను మార్చనున్నట్లు సమాచారం.దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఐపీఎల్ పదిహేడో సీజన్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహించడం ఖాయమైనట్లు లీగ్ చైర్మన్ అరుణ్ ధూమల్ గతంలోనే నిర్ధారించారు. అయితే 15 రోజుల మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల చేసి… ఆ తర్వాత మిగతా మ్యాచ్‌ల తేదీలను ప్రకటిస్తామని తెలిపింది.
అయితే, సెకండాఫ్ వేదిక విషయంలో మాత్రం బీసీసీఐ తాజాగా నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తన కథనంలో పేర్కొంది.
ఎన్నికల షెడ్యూల్ వెల్లడైన తర్వాతే ఐపీఎల్ సెకండాఫ్ ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. బీసీసీఐలోని కొంతమంది పెద్దలు మాత్రం ఇప్పటికే దుబాయ్ వైపు మొగ్గుచూపుతున్నారని సమాచారం. ఒకవేళ మిగిలిన మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించడం ఖాయమైతే.. స్వదేశంలో వీక్షించాలనుకున్న అభిమానులకు నిరాశే అని చెప్పాలి.