క్రికెట్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు… టైటిల్ ఫేవరెట్ అనుకున్న జట్టు చిన్న టీమ్ చేతిలో ఓడిపోవచ్చు.. వరల్డ్ క్రికెట్ లో అప్పుడప్పుడు సంచలనాలు సృష్టించే బంగ్లాదేశ్ ఇటీవలే పాక్ జట్టును వారి సొంతగడ్డపై ఓడించింది. ఇప్పుడు భారత్ తో టెస్ట్ సిరీస్ కు రానుంది. సాధారణంగా బంగ్లాతో సిరీస్ అంటే భారత్ పెద్ద సీరియస్ గా తీసుకున్న సందర్భాలు లేవు. ఈ సారి మాత్రం కాస్త అప్రమత్తంగా ఉన్నట్టే కనిపిస్తోంది. పాక్ పై బంగ్లా ఆటతీరే దీనికి ఉదాహరణ.. అలాగే కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ను బంగ్లా ప్రదర్శన టెన్షన్ పెట్టినట్టు కనిపిస్తోంది. అందుకే వారిని తేలిగ్గా తీసుకునే ఉద్దేశంలో లేని గంభీర్ నలుగురు స్పిన్నర్లతో పాటు స్టార్ పేసర్ బూమ్రాను జట్టులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
నిజానికి బూమ్రాకు బంగ్లాతో సిరీస్ నుంచి రెస్ట్ ఇస్తారని భావిస్తే అనూహ్యంగా ఎంపిక చేశారు. సొంతగడ్డపై పూర్తి ఆధిపత్యంతో బంగ్లాదేశ్ ను చిత్తు చేయడమే లక్ష్యంగా జట్టు ఎంపిక జరిగినట్టు అర్థమవుతోంది. కివీస్ , ఆసీస్ తో సిరీస్ లకు ముందు ప్రతీ ప్లేయర్ ఫామ్ లోకి రావాలన్న ఉద్దేశమూ కనబడుతోంది. బంగ్లాతో సిరీస్ ఆడాలని బూమ్రా నిర్ణయించుకోవడం అతని ఎంపికకు మరో కారణంగా బోర్డు వర్గాలు తెలిపాయి. ఇక చెన్నై లాంటి స్పిన్ పిచ్ లపైనా బూమ్రా తన పేస్ తో సత్తా చాటడం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు.