ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్.. తొలి వన్డేలో అనూహ్య పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచులో 21 బంతులు ఎదుర్కొన్న తమీమ్ కేవలం 13 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ అనంతరం రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించాడు. గతేడాది టీ 20 ల నుంచి తప్పుకున్న తమీమ్.. తాజాగా అన్ని ఫార్మాట్ ల నుండి వైదొలుగుతున్నట్లుగా తెలిపాడు. ఒకప్పుడు పసికూనగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు అన్ని జట్లకు పోటీని ఇస్తుందంటే అందులో తమీమ్ పాత్ర ఎంతైనా ఉంది. ఓపెనర్ గా వచ్చి ఎలాంటి బౌలింగ్ నైనా ఎదుర్కోగల సత్తా ఈ స్టార్ ఓపెనర్ సొంతం. పసికూన బ్యాటరే అయినా గణాంకాలు చూస్తే ఈ క్రికెటర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
2007లో ఇంటర్నేషనల్ కెరీర్ లో డెబ్యూ చేసిన తమీమ్ ఇక్బాల్.. తన 16 ఏళ్ల ప్రస్థానాన్ని నిన్నటితో ముగించాడు. ఇప్పటివరకు కెరీర్‌లో 69 టెస్టుల్లో 5082 పరుగులు చేయగా 238 వన్డేల్లో 8313 పరుగులు చేసాడు. ఇక 78 టీ20 మ్యాచుల్లో 1758 పరుగులు చేసాడు. 2020 లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తమీమ్ 37 మ్యాచుల్లో 21 విజయాలు అందించాడు. బంగ్లాదేశ్ టీమ్ తరుపున 10 వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ తమీమ్ ఇక్బాల్. నిన్న జరిగిన ఆఫ్ఘానిస్తాన్ తో తొలి మ్యాచ్ ఓడిన తర్వాతి రోజే ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టిన తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.