Shashi Tharoor: వరల్డ్ కప్ విషయంలో కాంగ్రెస్ ప్రశ్నకు బీసీసీఐ రాపిడ్ రిప్లై

వన్డే ప్రపంచకప్‌ 2023 మైదానాల ఎంపికపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. తమకు అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయంతోపాటు నిరసన వ్యక్తమవుతోంది.

  • Written By:
  • Publish Date - June 28, 2023 / 07:45 PM IST

మొహాలీ గురించి పంజాబ్‌ క్రీడల మంత్రి.. తిరువనంతపురం మైదానంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. వన్డే ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల నిర్వహణకు రాంచీ, మొహాలీ, తిరువనంతపురం మైదానాలను కూడా ఎంపిక చేస్తే బాగుండేదని ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. అయితే, శశిథరూర్‌ చేసిన కామెంట్లపై బీసీసీఐ వర్గాలు కాస్త ఘాటుగానే స్పందించాయి. సౌత్‌ జోన్‌లో మూడు మైదానాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నాయి. బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించాయి. ‘‘దక్షిణ జోన్‌లోని ప్రతి మైదానంలో మ్యాచ్‌ నిర్వహించలేం. దేశవ్యాప్తంగా పది స్టేడియాలను ఎంపిక చేశాం.

సౌత్‌ జోన్‌లో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వేదికల్లో మ్యాచ్‌లను పెడుతున్నాం. ఒకవేళ కేరళలోనూ మ్యాచ్‌లను నిర్వహిస్తే బాగుంటుందని శశిథరూర్‌ భావిస్తే.. తొలుత ఆ స్టేడియాన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘం పరిధిలోకి తీసుకు రండి. ఇప్పుడు ఎందుకు ఐఎల్‌ఎఫ్‌ఎస్ పరిధిలో ఉంది? ఇప్పుడు అదనంగా వారి నుంచి అనుమతులను పొందేందుకు బీసీసీఐకి అవసరం ఏముంది?. ఇతర దేశాల్లో కేవల ఆరేడు మైదానాల్లోనే మ్యాచ్‌లను నిర్వహించేందుకు ఐసీసీ అనుమతి ఇస్తుంది. అయితే, భారత్ అతిపెద్ద దేశం కాబట్టి మరిన్ని స్టేడియాల్లో నిర్వహణకు ఐసీసీ నుంచి అనుమతి పొందాం. అయితే, ప్రతి ఒక్కరినీ సంతోషపరచలేం’’ అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.