Team India: బుద్ధి లేని బీసీసీఐ.. బుర్రలేని రోహిత్, కోహ్లీ.. ఇలా అయితే వరల్డ్‌ కప్‌ కూడా అస్సామే..!

ఏం సెలక్షన్ రా బాబు.. వెస్టిండీస్‌తో వన్డే, టెస్టు టీమ్‌లు చూసిన తర్వాత బీసీసీఐకి ఉన్న డబ్బు పిచ్చి ప్రపంచంలో మరెవరికీ లేదనిపిస్తుంది. ఈ బుద్ధి ఇలానే కొనసాగితే రానున్న ప్రపంచ్‌కప్‌ కూడా అస్సామే అవుతుంది.

  • Written By:
  • Publish Date - June 23, 2023 / 06:03 PM IST

ది గ్రేట్‌ వెస్టిండీస్‌పై వన్డే, టెస్టులు ఆడే టీమిండియాను బీసీసీఐ సెలక్ట్ చేసింది. వెస్టిండీస్‌కి టీ20లు తప్ప మరే ఫార్మాట్‌లోనూ కలిసిరాని కాలమిది. అదంతా ఆ దేశాపు బోర్డు చేసిన ఘనకార్యాల వల్ల దాపరించిన దుస్థితి..! మన బీసీసీఐ కూడా ఏం తక్కువ కాదు.. వెస్టిండీస్‌ బోర్డులాగా పిసినారి కాదు కానీ డబ్బు పిచ్చి పట్టిన బోర్డు మనది. ఎంతలా అంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి ముందు కీలక ఆటగాళ్లని ఐపీఎల్‌లో అన్నీ మ్యాచ్‌లు ఆడించింది. ఫైనల్‌కి 10 రోజులు ముందు కూడా మనొళ్లు ఐపీఎల్‌లో ఆడారు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా రెస్ట్ తీసుకోకుండా కోహ్లీ, రోహిత్‌ టీమిండియా తరఫున ఫైనల్ ఆడాలన్న కనీస బాధ్యత మరిచి తమ ఫ్రాంచైజీలకు ఆడారు. సరే జరిగిందేదో జరిగిపోయిందని అనుకోవడానికి లేదు.. మళ్లీ అదే తప్పు రిపీట్ చేస్తున్నారు. వన్డే వరల్డ్‌ కప్‌కు మరో నాలుగు నెలులు సమయం మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో కూడా వెస్టిండీస్‌పై ప్రధాన ఆటగాళ్లను బీసీసీఐ బరిలోకి దింపుతుంది.

రోహిత్, కోహ్లీ చాలా సెల్ఫిష్‌:
పేరుకే రోహిత్ కెప్టెన్‌.. పెత్తనమంతా బీసీసీఐదే.. లేకపోతే ఏంటీ ఘోరం.. అసలు రోహిత్‌, కోహ్లీ వెస్టిండీస్‌ సిరీస్‌ ఆడాల్సిన అవసరం ఏముంది. అది కూడా వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌లో వీళ్లు ఆడడం దేనికి..? వ్యక్తిగత రికార్డుల కోసమా..? ప్రపంచ కప్‌కు ముందు కావాల్సిన రెస్ట్ తీసుకోకుండా ఇలా అల్లాటప్పా సిరీస్‌లు ఆడడం అందుకోసమే అనిపిస్తుంది.. లేకపోతే కోహ్లీ, రోహిత్‌ లేకపోతే రేటింగ్స్‌ రావు అని..డబ్బు పిచ్చి నరనరాన ఉన్న బీసీసీఐ వీళ్లద్దరిని ఆడిస్తుందా..? ఏమో..ఇందులో మర్మమేంటో బీసీసీఐనే చెప్పాలి. అసలు ఈ ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ ప్రిపరేషన్స్‌ ఎంత వరకు వచ్చినట్టు.. అసలు ఓ ప్లానూ, పాడూ ఉందా..?

ధోనీ, గ్యారీ, నాటీ బీసీసీఐ..గోల్డెన్‌ ప్లాన్:
ఫ్లాష్‌ బ్యాక్‌కి వెళ్ధాం.. 2007 వన్డే ప్రపంచ్‌కప్‌లో లీగ్‌ దశలోనే ఇంటి ముఖం పట్టం. సరిగ్గా వరల్డ్‌ కప్‌కి ముందే విండీస్‌పై సిరీస్‌ విక్టరీ కొట్టాం.. అప్పటి గ్రేగ్‌ చాపెల్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేర్పులతో జట్టు కూర్పు దెబ్బతిన్నది.. వరల్డ్‌కప్‌లో ప్రయోగాలతో బరిలోకి దిగిన టీమిండియా బొక్క బొర్లా పడింది. టీమిండియా ఆటగాళ్లు కన్నీరు పెట్టుకున్నారు. 2011లోనైనా కప్‌ గెలవాలని అప్పుడే డిసైడ్ అయ్యారు. పరిస్థితులు మారడంతో కెప్టెన్‌గా ధోనీ, హెడ్‌ కోచ్‌గా గ్యారీ ఎన్నికయ్యారు. అప్పటినుంచే.. అంటే 2008 నుంచే ప్రపంచ్‌కప్‌ కోసం ప్లాన్‌ రెడీ చేసుకున్నారు. ముందుగా గంగూలీ, ద్రవిడ్‌ని వన్డే టీమ్‌ నుంచి సాగనంపారు. అటు జహీర్‌, సెహ్వాగ్‌లకు ఎక్కువగా రెస్ట్ ఇస్తూ వచ్చారు. 2009లో ఇలానే చేశారు. ఇక 2010 వచ్చింది. అప్పుడు సెహ్వాగ్‌, జహీర్‌ని ఆడిస్తూ సచిన్‌కి రెస్త్ ఇస్తూ వచ్చారు. ఆ ప్లాన్‌ ఎంతలా అమలు చేశారంటే.. ఏడాదికి కనీసం 25-30 వన్డేలు ఆడే సచిన్‌.. 2010లో కేవలం రెండు వన్డేలే ఆడాడు.. అది కూడా సౌత్‌ఆఫ్రికా సిరీస్‌ కావడంతో ఆడించారు..అందులో రెండో మ్యాచ్‌లో సచిన్‌ డబుల్ సెంచరీ చేశాడు.. అంతే ఆ తర్వాత ఏడాది పాటు సచిన్‌ ఒక్కటంటే ఒక్క వన్డే కూడా ఆడలేదు.. కేవలం టెస్టులే ఆడించారు.. ఒక్కరూ కూడా గాయాల బారిన పడకూడదని.. అందరూ తగిన రెస్ట్ తీసుకునే వన్డే ప్రపంచ కప్‌ ఆడాలని అప్పటి బీసీసీఐ పెద్దలు భావించారు.

ఇలా 2008 నుంచే వన్డే ప్రపంచ్‌కప్‌కు టీమిండియా రెడీ అయ్యింది. 2011 వరల్డ్‌ కప్‌లో బీసీసీఐ ప్లాన్‌ సూపర్‌ హిట్ అయ్యింది.. అన్నీ డిపార్ట్‌మెంట్లలోనూ అదరగొట్టింది.. అంత బలమైన టీమిండియా జట్టు అంతకముందు లేదు.. ఇప్పటికీ వరకు మళ్లీ రాలేదు.. ఇది ప్రపంచ్‌ కప్‌ గెలవాలన్న పట్టుదల ఉంటే ఎవరైనా చేసే పని. ఇప్పుడు ఫ్లాష్‌ బ్యాక్‌ నుంచి ప్రస్తుతానికి వద్దాం. ఆ జట్టుతో ఈ జట్టుకు ఒక్కటంటే ఒక్క పోలిక కూడా లేదు.. ముందుగా బీసీసీఐకి బుద్ధి లేదు.. కాసుల కక్కుర్తి తప్ప ఇంకెమీ పట్టని బోర్డు అది.. ఇలానే కొనసాగితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓడినట్టే.. ప్రపంచ్‌కప్‌లోనూ ఓడిపోతాం.. ఇది పక్కా..!