Sarfaraz Khan: టీమిండియాలో ఫేవరెటిజం ఎక్కువ. వాళ్లకి నచ్చినవాళ్లని ఏం ఆడకున్నా తీసుకుంటారు. నచ్చకపోతే ఎంత బాగా ఆడినా తీసుకోరు..! సర్ఫరాజ్ ఖాన్ దీనికి తాజా ఉదాహరణ.
సర్ఫరాజ్‌ఖాన్.. ఇప్పుడీ పేరు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ సర్కిల్స్‌లో మారుమోగుతోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత అత్యధిక యావరేజ్ కలిగిన ఈ ముంబై ఆటగాడికి ప్రతిసారీ అన్యాయమే జరుగుతోంది. ఇదిగో సర్ఫరాజ్ ఎంట్రీ.. అదిగో సర్ఫరాజ్ ఎంట్రీ అంటూ అభిమానులు అతడి రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుండగా.. బీసీసీఐ మాత్రం తనకు నచ్చిందే చేసుకుపోతోంది. ఇన్నాళ్లు సర్ఫరాజ్ సెలెక్షన్‌పై నోరు విప్పని బీసీసీఐ తాజాగా అతడిని టీమిండియాకి ఎంపిక చేయకపోవడానికి కారణాలేంటో చెప్పింది. అది విన్న ఫ్యాన్స్ రెండు జేబులో రెండు చేతులను పెట్టుకోని ఏదో ఆలోచిస్తూ ఎక్కడికో నడుచుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇంతకీ బీసీసీఐ చెప్పిన ఆ కారణమేంటి..?
నిజంగా పిచ్చి సమాధానమే
సెహ్వాగ్ తెలుసు కదా.. అతని ఆటతీరు తెలుసు కదా.. ఎంతటి భయంకర హిట్టరో తెలుసు కదా.. సెహ్వాగ్ తన కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మాట వాస్తవమే కావొచ్చు.. కానీ అతను టీమ్‌లో ప్లేస్ కోల్పోవడానికి కారణం అతని బరువు కాదు.. అతని ఫిట్‌నెస్ కూడా కాదు. కేవలం ఫామ్ లేకపోవడం. పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ తెలుసు కదా.. ప్రపంచ క్రికెట్ గ్రేట్స్‌లో ఇంజీ ఒకరు. వన్డేల్లో 10వేలకు పైగా రన్స్ చేశాడు. అది కూడా అధిక బరువుతోనే. ఏ ఆటలోనైనా ఫిట్‌నెస్ ముఖ్యమే కావొచ్చు. కానీ ఫిట్‌నెస్ మాత్రమే ముఖ్యం కాదు. టాలెంట్‌తో తమ ఫిట్‌నెస్‌పై విమర్శలు రాకుండా చేసుకున్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు సర్ఫరాజ్ కూడా అదే లిస్ట్‌లోకి వస్తాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఎన్నో ఏళ్లుగా పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్‌ని సెలక్ట్ చేయకపోవడానికి కారణం అతని బరువు అని చెప్పింది బీసీసీఐ. వాస్తవానికి జట్టులో ఓ ఆటగాడు స్లో ఫీల్డర్ అయినంతా మాత్రాన జరిగే నష్టమేమీ లేదు. సెహ్వాగ్ కూడా స్లో ఫీల్డరే. కానీ ఆ లోపం వల్ల టీమిండియా ఏనాడూ.. ఏ మ్యాచ్ ఓడిపోలేదు. టీమ్‌లో ఓ ఆటగాడు అధిక బరువుతో ఆడినంత మాత్రన జరిగే నష్టమేమీ లేదు. అతడినేం పాయింట్‌లో ఫిల్డింగ్ పెట్టరు. పోనీ అదే నిజం అని కాసేపు అనుకున్నా.. రంజీల్లో పరుగుల సునామీ సృష్టిస్తున్న అభిమన్యు ఈశ్వరన్‌ని ఎందుకు సెలక్ట్ చేయడం లేదో చెప్పగలరా..? అతని తల వెంట్రుకలు సరిగ్గా లేవని బీసీసీఐ సమాధానం చెప్పచ్చు. అందుకే వాళ్లని కారణం అడగొద్దు.
పచ్చి అబద్ధం చెప్పారు..!
సర్ఫరాజ్‌ని సెలక్ట్ చేయకపోవడానికి బీసీసీఐ చెప్పిన మరో కారణం మరింత షాకింగ్‌గా ఉంది. అతని ప్రవర్తన సరిగ్గా ఉండదని.. సెంచరీ చేసిన తర్వాత తొడగొడతాడని బీసీసీఐ చెప్పింది. ఈ తొడకొట్టుడుకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఎంత బాగా ఆడినా తనని సెలక్ట్ చేయకపోవడంతో ఓ సారి నాటి చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ మ్యాచ్ చూస్తుండగా సెంచరీ చేసిన తర్వాత సర్ఫరాజ్ తొడగొట్టాడన్న ప్రచారముంది. అయితే ఇది నిజం కాదని తాజాగా తేలింది. సర్ఫరాజ్ తొడకొట్టింది అతని కోచ్ కోసమని ఫ్రూవ్ అయ్యింది. ఇక ఆ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీ చేసిన సమయంలో అసలు చేతన్ శర్మ అక్కడే లేనే లేడట. మ్యాచ్‌ను వీక్షించింది చేతన్ శర్మ కాదు. అతను సలీల్ అంకోలా. ఇది చాలదా.. అతడి గురించి బీసీసీఐ ఎన్ని అబద్ధాలు చెబుతోందో.
అయినా అదేం కారణం?
సరే నిజంగానే మ్యాచ్ వీక్షించింది చేతన్ శర్మనే అనుకుందాం. సర్ఫరాజ్ అతడిని చూసే తొడగొట్టాడని కాసేపు ఫీల్ అవుదాం. అందులో తప్పేముంది..? ఈ మాత్రం దానికి ప్రవర్తన బాగో లేదు అని బీసీసీఐ ఎలా చెబుతుంది..? ఓ యువ ఆటగాడి టాలెంట్‌ని అర్థం చేసుకోలేని బీసీసీఐ అతడి బాధని, కసిని ఎలా అర్థం చేసుకుంటుంది..? ఇలా ప్రవర్తనే సరిగ్గా లేదు అని.. అందుకే సెలక్ట్ చేయలేదన్నది ముమ్మాటికి అబద్ధం. ఎందుకంటే టీమిండియాలో మిడిల్ ఫింగర్లు, ప్రత్యర్థి ఆటగాళ్లు అవుటైనప్పుడు గేలి చేసే ఆటగాళ్లున్నారు. కానీ జనాల కళ్లకి వాళ్లంతా అందంగా ఉంటారు. అందుకే వాళ్లు చేస్తే అగ్రెసివ్‌నెస్ అని.. దూకుడు అని గొప్పలు పోతారు. మిగిలిన జట్ల ఆటగాళ్లకి మాత్రం అదంతా చిల్లరగా కనిపిస్తుంది. ఇవేవీ మనకు పట్టవు.. సర్ఫరాజ్ లావుగా ఉన్నాడు.. క్యూట్‌గా లేడు.. అందుకే అతను చేసేది దూకుడు ఖాతాలోకి వెళ్లదు. ఇదంతే..! బీసీసీఐని అడగొద్దంతే..!