Gautam Gambhir : సపోర్టింగ్ కోచ్ లకు బీసీసీఐ ఓకే.. జట్టుతో చేరనున్న నాయర్, డస్కాటే

భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ గా ఇటీవలే గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు. శ్రీలంక టూర్ కు జట్టు ఎంపికతోనే అతని ప్రస్థానం మొదలైంది.

 

 

భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్ గా ఇటీవలే గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నాడు. శ్రీలంక టూర్ కు జట్టు ఎంపికతోనే అతని ప్రస్థానం మొదలైంది. టీమ్ సెలక్షన్ లో తనదైన ముద్ర వేసిన గంభీర్ ఇప్పుడు తన సపోర్టింగ్ స్టాఫ్ విషయంలోనూ మాట నెగ్గించుకున్నాడు. అతను సిఫార్సు చేసిన పేర్లకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అభిషేక్ నాయర్ , నెదర్లాండ్స్ మాజీ ప్లేయర్ డస్కాటే భారత జట్టు అసిస్టెంట్ కోచ్ లుగా ఎంపికయ్యారని సమాచారం. కోల్ కతా నైట్ రైడర్స్ కు గంభీర్ తో కలిసి వీరిద్దరూ పనిచేశారు. లంక టూర్ నుంచే వీరిద్దరూ జట్టుతో కలిసే అవకాశముంది. అటు ద్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు పనిచేసిన దిలీప్ ఫీల్డింగ్ కోచ్ గా కొనసాగనున్నాడు.

దిలీప్ కోచింగ్ లోనే భారత ఫీల్డింగ్ ప్రమాణాలు అత్యుత్తమ స్థాయికి చేరాయి. దీంతో అతన్నే కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇదిలా ఉంటే బౌలింగ్ కోచ్ గా సౌతాఫ్రికా మాజీ పేసర్‌ మోర్నే మోర్కెల్‌ ఎంపికయ్యే అవకాశాలున్నాయి. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం మోర్కెల్ పేరును కూడా గంభీరే సిఫార్సు చేశాడు. మోర్కెల్‌ సైతం గంభీర్‌తో గతంలో కలిసి పనిచేశాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌గా గౌతీ రెండేళ్లు సేవలు అందించినప్పుడు మోర్కెల్ కూడా అసిస్టెంట్ కోచ్ గా ఉన్నాడు. మొత్తం మీద సహాయక సిబ్బంది ఎంపికలోనూ గంభీర్ తన ముద్ర ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి.