T10 league: ఇకపై పది ఓవర్ల మ్యాచ్‌లు.. బీసీసీఐ కొత్త క్రికెట్ లీగ్..!

క్రికెట్‌లో ఐపీఎల్ ఒక సంచలనం. ఈ ఫార్మాట్ సక్సెస్ అయిన నేపథ్యంలో మరో కొత్త లీగ్‌ను కూడా ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. పది ఓవర్ల ఫార్మాట్‌గా ఈ లీగ్ కొనసాగే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 07:48 PM IST

T10 league: ఐపీఎల్ ఏర్పాటుతో దేశంలో క్రికెట్‌కు కొత్త ఊపు తీసుకొచ్చిన బీసీసీఐ ఇప్పుడు మరో కొత్త లీగ్ ప్రారంభించబోతుంది. ఈ కొత్త లీగ్ పది ఓవర్ల ఫార్మాట్లో ఉండబోతుందని తెలుస్తోంది. క్రికెట్‌లో ఐపీఎల్ ఒక సంచలనం. దేశీయంగానే కాకుండా.. అంతర్జాతీయంగానూ క్రేజ్ ఉంది. ఫ్యాన్స్‌కు క్రికెట్ మజా అందిస్తోంది. బీసీసీఐకి కాసుల పంట కురిపిస్తోంది. దేశంలోని పలువురు ఆటగాళ్లకు అవకాశం, గుర్తింపు, ఆదాయం తెచ్చిపెడుతోంది.

MS DHONI JERSEY: ధోని జెర్సీ నెంబర్‌7పై బీసీసీఐ సంచలనం.. ఆ నెంబర్‌‌కు ఇక రిటైర్మెంట్..

ఈ ఫార్మాట్ సక్సెస్ అయిన నేపథ్యంలో మరో కొత్త లీగ్‌ను కూడా ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. పది ఓవర్ల ఫార్మాట్‌గా ఈ లీగ్ కొనసాగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన బ్లూప్రింట్ విషయమై బీసీసీఐ కార్యదర్శి జై షా పని చేస్తున్నారు. ఐపీఎల్‌లాగే జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇందుకోసం స్పాన్సర్లు, స్టేక్ హోల్డర్లకు ఆహ్వానం అందించారు. వారి నుంచి లీగ్‌కు దరఖాస్తులు స్వాగతించినట్లు తెలుస్తోంది. ఆయా సంస్థలు, యాజమాన్యాలకు టోర్నీ గురించి వివరిస్తారు. అయితే, కొత్త జట్లను పిలవాలా.. లేక ఇప్పటికే ఉన్న జట్లకే ఈ లీగ్ అవకాశం కూడా ఇవ్వాలా అని బీసీసీఐ ఆలోచిస్తోంది. అలాగే.. ఈ లీగ్‌ను పది ఓవర్ల ఫార్మాట్లో నిర్వహించాలా..? లేకపోతే 20వ ఓవర్ల ఫార్మాట్లో నిర్వహించాలా? అనే విషయంపై బీసీసీఐ సందిగ్ధంలో ఉంది. అలాగే ఆటగాళ్ల వయో పరిమితి, టోర్నీ వేదిక వంటి ఇతర అంశాలపై కూడా త్వరలోనే బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకుంటుంది.

వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ కొత్త లీగ్‌ను బీసీసీఐ పరిచయం చేసే అవకాశం ఉంది. అలాగే ఐపీఎల్‌కు ఇబ్బంది కలగకుండా.. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఈ లీగ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే, బీసీసీఐ టీ10 ఫార్మాట్ ప్రారంభిస్తే.. అది వన్డే క్రికెట్‌ను చంపేస్తుందని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయం కోసం ఇలా సంప్రదాయ క్రికెట్‌ను చంపేయడం సరికాదని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికే టీ20ల వల్ల వన్డేలు, టెస్టులకు ఆదరణ తగ్గిన సంగతి తెలిసిందే.