Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. త్వరలోనే ఏపీలో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం వైజాగ్‌లో డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి క్రికెట్ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనితోపాటు మరొక స్టేడియాన్ని విశాఖపట్టణంలో ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. తాజాగా గోవా వేదికగా బీసీసీఐ 92వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. వీటిలో పాల్గొనేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి.శరత్ చంద్ర రెడ్డి, సెక్రటరీ ఎస్.ఆర్. గోపీనాథ్ రెడ్డి వెళ్లారు.
ఈ సందర్భంగా బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షాను వీళ్లిద్దరూ కలిశారు. ఈ క్రమంలోనే విశాఖపట్టణంలో మరో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడం గురించి చర్చించారట. దీనికి కావలసిన సహకారాన్ని బీసీసీఐ వైపు నుంచి పూర్తిగా అందిస్తామని రోజర్ బిన్నీ, జై షా ఇద్దరూ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమయంలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవల కాలంలో చేస్తున్న కార్యక్రమాల గురించి శరత్ చంద్ర, గోపీనాథ్ ఇద్దరూ బీసీసీఐ పెద్దలకు వివరించారు. దీంతో చాలా సంతోషించిన జై షా.. త్వరలోనే తను స్వయంగా వైజాగ్ సందర్శిస్తానని కూడా మాటిచ్చారట. ఇటీవలే యూపీలోని ప్రఖ్యాత నగరం కాశీలో కూడా కొత్త క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ రెడీ అయిన సంగతి తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి ఈ స్టేడియానికి శంకుస్థాపన చేశారు.
మొత్తం రూ.451 కోట్ల ఖర్చుతో కాశీ థీమ్‌లోనే ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్టేడియం కోసం భూసేకరణ జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి టీమిండియా మాజీ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ తదితరులు హాజరయ్యారు. మొత్తం 30 వేల మంది ప్రేక్షకుల కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ స్టేడియం 2025 నాటికి సిద్ధం అవుతుంది. ఇలా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా కొత్త స్టేడియాలు నిర్మించాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు సమాచారం.