ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) విషయంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండు సార్లు ఐపీఎల్ (IPL) నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ను రెండు ఎడిషన్లు పాటు నిర్వహిస్తే బాగుంటుందని గతంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి సూచించాడు. ఈ దిశగా బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకే ఏడాదిలో రెండో ఎడిషన్ నిర్వహించడానికి బీసీసీఐకి విండో దొరకడం కష్టమే ఇప్పటికే ఐసీసీ ఈవెంట్స్, ద్వైపాక్షిక సిరీస్‌లతో వచ్చే రెండేళ్ల పాటు ఉక్కిరి బిక్కిరయ్యే షెడ్యూల్ ఉంది.
రెండు ఎడిషన్స్ నిర్వహించే విషయానికి బోర్డు ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ పరోక్షంగా వెల్లడించారు. రెండు ఎడిషన్స్ తో భారత క్రికెట్‌కు మేలు జరుగుతుందని చెప్పారు. ఒక వేళ రెండు ఎడిషన్స్ నిర్వహిస్తే టీ10 ఫార్మాట్ బావుంటుందనేది కొందరి అభిప్రాయం. దీనిపైనా అరుణ్ ధూమల్ (Arun Dhumal) కీలక వ్యాఖ్యలు చేశారు. టీ10 ఫార్మాట్ గురించి తాము ఆలోచించడం లేదని, భారత క్రికెట్‌కు మేలు జరిగే నిర్ణయమే తీసుకుంటామని చెప్పారు.అభిమానులను ఎంటర్‌టైన్ చేయడానికే బీసీసీఐ అధిక ప్రాధాన్యత ఇస్తుందని అరుణ్ ధూమల్ స్పష్టం చేశారు. ఆటగాళ్ల ప్రదర్శన కంటే అభిమానుల ప్రేమతోనే ఐపీఎల్ సక్సెస్ అయ్యిందని అభిప్రాయపడ్డారు.