ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోన్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ముందు పాక్ క్రికెట్ బోర్డు ఓవరాక్షన్ చేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చిన డిమాండ్లు చేస్తున్న పీసీబీకి బీసీసీఐ, ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చాయి. హైబ్రిడ్ మోడల్ కు ఒప్పుకోవాలంటే తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనంటూ పాక్ క్రికెట్ బోర్డు అత్యుత్సాహానికి పోయింది. అయితే పాక్ బోర్డు డిమాండ్లను అంగీకరించేది లేదని బీసీసీఐ, ఐసీసీ తేల్చేశాయి. అధికారిక ప్రకటన ఇంకా చేయకున్నా ఇప్పటి వరకూ సమాచారం ప్రకారం పీసీబీ కండీషన్లు ఆమోదించే ప్రసక్తే లేదని బీసీసీఐ ఐసీసీకి కుండబద్దులకొట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాక్ వెళ్ళడం లేదు. దీంతో ఇండియా ఆడే మ్యాచ్ లను తటస్థ వేదికపై నిర్వహించేలా ఐసీసీ ప్లాన్ చేసింది. దీనికి ఒప్పుకోవాలంటే భవిష్యత్తులో తాము కూడా భారత్ కు రాలేమని, ప్రతీ ఐసీసీ టోర్నీకి హైబ్రిడ్ మోడల్ పెట్టాలంటూ పాకిస్తాన్ డిమాండ్ చేసింది.
అయితే పాక్ క్రికెట్ బోర్డు డిమాండ్లను ఇటు బీసీసీఐ , అటు ఐసీసీ కొట్టిపారేశాయి. ఎట్టపరిస్థితుల్లోనూ పాక్ బోర్డు అనుకున్నవేమీ జరగవని తేల్చేశాయి. భారత్ లో సెక్యూరిటీకి సంబంధించి ఎటువంటి ఆందోళన లేదని, గత ఏడాది ప్రపంచకప్ ను కూడా సక్సెస్ ఫుల్ గా నిర్వహించామని బీసీసీఐ గుర్తు చేసింది. నిత్యం బాంబు పేలుళ్ళతో సతమతమయ్యే పాక్ తమ గురించి తాము ఎక్కువగా ఊహించుకుంటుందని అభిప్రాయం వినిపించింది. ఆటగాళ్ళ భద్రతా విషయంలో భారత్ లో ఎటువంటి ఇబ్బందీ ఉండదనీ బీసీసీఐ గుర్తు చేసింది. అందుకే భారత్ ఆతిథ్యమిచ్చే ఏ ఐసీసీ టోర్నీకి కూడా హైబ్రిడ్ మోడల్ అవసరం లేదని స్పష్టం చేసింది.
అటు ఐసీసీ కూడా బీసీసీఐకే మద్ధతుగా నిలిచింది. బీసీసీఐ చెప్పిన వివరణతో సంతృప్తి చెందిన ఐసీసీ పాక్ బోర్డు డిమాండ్లకు నో చెప్పినట్టు సమాచారం. అవసరమైతే పాకిస్తాన్ జట్టు ఆడేందుకు రాకున్నా కూడా భారత్ లో ఐసీసీ టోర్నీలో షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఐసీసీ చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వరల్డ్ క్రికెట్ లో భారత్ ఆడకుంటే ఐసీసీ భారీగా నష్టపోతుంది. అదే సమయంలో పాకిస్తాన్ జట్టు ఆడకున్నా ఎవ్వరూ అడిగేవారు లేరు. పైగా రెవెన్యూ పరంగా బీసీసీఐకి, పాక్ బోర్డుకు అసలు పోలికే లేదు. బీసీసీఐ కారణంగానే ప్రపంచ క్రికెట్ కు అత్యధిక ఆదాయం వస్తుందన్నది ఎవ్వరైనా అంగీకరించాల్సిందే.. పైగా ఇప్పుడు బీసీసీ సెక్రటరీ జైషానే ఐసీసీ ఛైర్మన్ గా ఉన్నారు. ఐసీసీలో మెజార్టీ సభ్యులు బీసీసీఐకే మద్ధతిస్తున్న నేపథ్యంలో పాక్ బోర్డు తన ఓవరాక్షన్ తగ్గించుకోకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.