Asia Cup: పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ భారీ షాకిచ్చింది. వచ్చే సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌లో జరగనున్న ఆసియా కప్ కోసం పాక్ రాలేమని తేల్చిచెప్పింది. దీంతో ఇంతకాలం ఈ విషయంపై ఆశలు పెట్టుకున్న పాక్ క్రికెట్ బోర్డుకు నిరాశే ఎదురైంది. భారత నిర్ణయంతో ఇతర దేశాలు కూడా ఇదే బాటపట్టబోతున్నాయి. పాక్‌లో పర్యటించేందుకు ఏ దేశం కూడా ఆసక్తి చూపడం లేదు. భారత నిర్ణయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని ఇతర దేశాలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో టోర్నీ శ్రీలంకకు మారే అవకాశం ఉంది.
ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఇండియాదే ఆధిపత్యం. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ. ఈ బోర్డు దగ్గరున్న ఫండ్స్ ఇతర ఏ దేశ క్రికెట్ సంస్థ లేదా క్రీడా సంస్థ దగ్గర కూడా లేవు. ఐసీసీకి ఎక్కువ నిధులు సమకూర్చిపెట్టేది కూడా బీసీసీఐనే. అందుకే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో కూడా భారత మాటే చెల్లుబాటు అవుతుంది. అనేకసార్లు ఇండియా తన పంతం నెగ్గించుకుంది. ఈ విషయం ఇప్పుడు మరోసారి రుజువైంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం వచ్చే సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. దీనికి ఆసియాలోని క్రికెట్ ఆడే దేశాలు హాజరవుతాయి. ఇండియా కూడా పాక్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే, పాక్ వెళ్లేందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు. అసలే పాక్ మన దాయాది దేశం. అందులోనూ ఇప్పుడు అక్కడ పరిస్థితులేం బాగోలేవు. రాజకీయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం, తీవ్రవాదం వంటి సమస్యలు పాక్‌ను వేధిస్తున్నాయి. ఇండియా పాక్‌లో పర్యటిస్తే భారత ఆటగాళ్ల భద్రతకు ముప్పు పొంచి ఉంది.
అందుకే పాక్ వెళ్లేందుకు ఇండియా అంగీకరించడం లేదు. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత క్రికెటర్లకు తగిన భద్రత ఇస్తామని, నిబంధనల ప్రకారం టీమిండియా అక్కడ పర్యటించాలని కోరింది. ఎలాగైనా టోర్నీ పాకిస్తాన్‌లోనే జరపాలని, కావాలంటే ఇండియా మ్యాచుల్ని ఇతర తటస్థ వేదికలపై జరిపేందుకు అంగీకరిస్తామని కూడా తెలిపింది. అయినప్పటికీ పాక్ పర్యటనకు ఇండియా రాకుంటే తాము కూడా అక్టోబర్‌లో ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్‌లో పాల్గొనే అంశంపై పునరాలోచన చేస్తామని హెచ్చరించింది. అయితే, పాక్ మాటల్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే వరల్డ్ కప్ టోర్నీని బహిష్కరించేంత సీన్ పాక్ క్రికెట్ బోర్డుకు లేదు. అందులోనూ పాక్ క్రికెట్ బోర్డుకు కూడా నిధుల కొరత ఉంది. ఇండియాతో మ్యాచ్ జరిగితే, అలాగే వరల్డ్ కప్‌లో పాల్గొంటేనే ఆ జట్టుకు ఆదాయం వస్తుంది. అలాంటిది ఇండియాను బెదిరించేంత సీన్ పాక్‌కు లేదు. అందువల్ల ఆ దేశం చేసిన హెచ్చరికల్ని ఇండియా లెక్కచేయలేదు. తన మాటకే కట్టుబడి ఉంది. పైగా ఇప్పుడు మన క్రికెట్ బోర్డును పాక్ పంపిస్తే ఇండియాలో రాజకీయంగానూ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే అటు ప్రభుత్వం.. ఇటు బీసీసీఐ పాక్ పర్యటనకు అంగీకరించడం లేదు.
శ్రీలంకలో టోర్నీ?
ఆసియా కప్‌లో ఇండియా లేకుంటే టోర్నీ చప్పగా ఉంటుంది. పాక్ వెళ్లేందుకు ఇండియా సిద్ధంగా లేదు. మరోవైపు బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గనిస్తాన్ కూడా పాక్ వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో మధ్యేమార్గంగా బీసీసీఐ సూచన మేరకు ఆసియా కప్ టోర్నీని శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీ, ఏసీసీ భావిస్తున్నాయి. ఈ విషయంలో పాకిస్తాన్‌కు తప్ప ఏ దేశానికీ అభ్యంతరం లేదు. పాకిస్తాన్ కూడా ప్రస్తుతం దీనికి అంగీకరించక తప్పని పరిస్థితి. దీంతో త్వరలోనే శ్రీలంకలో ఆసియా కప్ నిర్వహణపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
2008 నుంచి దూరం
2008లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఇండియా-పాక్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. దీని ప్రభావం క్రీడారంగంపై కూడా పడింది. అప్పట్నుంచి పాకిస్తాన్‌లో పర్యటనల్ని ఇండియా రద్దు చేసుకుంది. 2008 నుంచి ఇప్పటివరకు భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించలేదు. వరల్డ్ కప్ కోసం మాత్రం 2016లో పాక్ జట్టు ఇండియాలో పర్యటించింది. ఇతర సందర్భాల్లో ఇండియాలో లేదా తటస్థ వేదికల మీద రెండు దేశాల మధ్య మ్యాచులు జరిగాయి.