Indian Cricket Team : అంత ఈజీ కాదు.. కొత్త కోచ్ ముందు సవాళ్ళు ఇవే

భారత క్రికెట్ జట్టు కోచ్ అంటే అంత ఈజీ కాదు.. ఎంతో ఒత్తిడి, ఎన్నో అంచనాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు యువ, సీనియర్ ఆటగాళ్ళను సమన్వయం చేసుకుంటూ అంచనాలను అందుకుంటూ ఉండాల్సిందే.

భారత క్రికెట్ జట్టు కోచ్ అంటే అంత ఈజీ కాదు.. ఎంతో ఒత్తిడి, ఎన్నో అంచనాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు యువ, సీనియర్ ఆటగాళ్ళను సమన్వయం చేసుకుంటూ అంచనాలను అందుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయంతో కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసింది. ద్రావిడ్ స్థానంలో త్వరలోనే భారత్ కొత్త కోచ్ ను ఎంపిక చేయనుంది. ఇప్పటికే గంభీర్, రామన్ పేర్లు షార్ట్ లిస్ట్ అయినట్టు తెలుస్తోంది. వీరిద్దరిలో గంభీర్ వైపే బీసీసీ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఎవరు కోచ్ గా వచ్చినా ఎదుర్కోవాల్సిన సవాళ్ళు చాలానే ఉన్నాయి.

వరల్డ్ కప్ గెలుపుతో 17 ఏళ్ళ నిరీక్షణకు తెరపడగా.. ఇప్పుడు తర్వాతి లక్ష్యాలను బీసీసీఐ నిర్థేశించింది. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవడమే టార్గెట్. కొత్తగా కోచ్ బాధ్యతలు స్వీకరించే వ్యక్తికి మరో పెద్ద సవాల్ సీనియర్లకు కొనసాగింపుగా యువ ఆటగాళ్ళను సిద్ధం చేయడం. ముఖ్యంగా టీ ట్వంటీ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్ , జడేజా స్థానాలను భర్తీలను చేసే ఆటగాళ్ళను గుర్తించాలి. పలువురు యువక్రికెటర్లు ఈ స్థానాల కోసం పోటీపడుతున్నా… వారిని నిలకడగా ఆడేలా చూడడం, ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించడం సవాల్ గానే చెప్పాలి. ఇక 2026 టీ ట్వంటీ వరల్డ్ కప్ కు కొత్త కెప్టెన్ తో పాటు పూర్తి యువ జట్టును రెడీ చేయడం మరో సవాల్. మొత్తం మీద గంభీర్ , రామన్ లలో ఎవరు కోచ్ గా ఎంపికైనా ఈ సవాళ్ళను ఎదుర్కోవడం అంత ఈజీ కాకపోవచ్చు.