Ben Stokes: స్టోక్స్ సునామీలో ధోని, కోహ్లీ సేఫ్..!

124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేసిన స్టోక్స్‌ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు. వన్డేల్లో, నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్ అగ్ర స్థానంలో ఉన్నాడు.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 06:16 PM IST

Ben Stokes: ఇంగ్లండ్‌ స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగు లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో స్టోక్స్ భారీ సెంచురీ సాధించాడు. 124 బంతుల్లో 15 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 182 పరుగులు చేసిన స్టోక్స్‌ ఈ రికార్డు తన పేరుపై లిఖించుకున్నాడు.

వన్డేల్లో, నాలుగు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో వెస్టిండీస్‌ దిగ్గజం సర్‌ వివియన్‌ రిచర్డ్స్ అగ్ర స్థానంలో ఉన్నాడు. రిచర్డ్స్ అత్యధికంగా 189 రన్స్ చేశాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్లు రాస్‌ టేలర్‌ 181 రన్స్, ఏబీ డివిలియర్స్‌ 176 రన్స్, కపిల్‌ దేవ్‌ 175 రన్స్ అధిగమించి.. బెన్‌ స్టోక్స్‌ రెండో స్థానానికి చేరుకున్నాడు. వివియన్‌ రిచర్డ్స్‌ 181 పరుగులు కూడా చేశాడు. వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గా బెన్‌ స్టోక్స్‌ చరిత్రకెక్కాడు. జేసన్‌ రాయ్‌ పేరిట ఉన్న రికార్డును స్టోక్స్‌ బద్దలు కొట్టాడు. 2018లో ఆస్ట్రేలియాపై రాయ్‌ 180 రన్స్ చేశాడు. మరోవైపు వన్డేల్లో నాన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగి.. అత్యధిక స్కోరు సాధించిన ఆరో ఆటగాడిగా కూడా స్టోక్స్‌ నిలిచాడు.

ఈ జాబితాలో చార్ల్స్‌ కొవంట్రీ 194 పరుగులు, వివియన్‌ రిచర్డ్స్‌ 189 పరుగులు, ఫాఫ్‌ డుప్లెసిస్‌ 185 పరుగులు, ఎంఎస్ ధోనీ 183 పరుగులు, విరాట్‌ కోహ్లీ 183 పరుగులు చేసి.. స్టోక్స్‌ కంటే ముందున్నారు. ఒక్క రన్‌తో ధోనీ రికార్డును స్టోక్స్‌ మిస్‌ అయ్యాడు.