ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఈ టోర్నమెంట్‌లో (Tournament) మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. చీలమండ నొప్పి వల్ల చికిత్స కోసం తన స్వదేశానికి వెళ్లిన మార్ష్.. తిరిగి మరి భారత్‌కు రావడం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ ధ్రువీకరించాడు. మార్ష్ క్రికెట్ ఆస్ట్రేలియా (Australia) వైద్య సిబ్బందిని సంప్రదించడానికి పెర్త్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో అతడి గాయాన్ని అంచనా వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం అక్కడే ఉండాలని సూచించినట్లు పాంటింగ్ తెలిపాడు. టీ20 వరల్డ్‌కప్‌నకు సమయం దగ్గరపడుతుండడంతో అతడిని భారత్‌కు పంపించి రిస్క్ చేయకూడదని క్రికెట్ ఆస్ట్రేలియా భావించనట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
వరల్డ్‌కప్‌లో ఆసీస్ సారథిగా మార్ష్ వ్యవహరించే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఏప్రిల్ 3న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరిగా మార్ష్ ఆడాడు. ఆ తర్వాత ముంబై, లక్నో సూపర్ జెయింట్స్, సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లకు కూడా అతడు దూరమయ్యాడు. ఈ టోర్నీలో విఫలమైన మిచెల్, రాజస్తాన్‌పై అత్యధికంగా 23 పరుగులను స్కోర్ చేశాడు. అసలే వరుస పరాజయాలతో డీలా పడిన ఢిల్లీకి మార్ష్ దూరమవడం పెద్ద దెబ్బగానే చెప్పాలి.