బంగ్లాదేశ్ టీమ్ కు షాక్ షకీబుల్ పై హత్య కేసు

  • Written By:
  • Publish Date - August 23, 2024 / 07:38 PM IST

పాకిస్తాన్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ చిక్కుల్లో పడ్డాడు. అతనిపై హత్య కేసు నమోదైంది.ఓ హత్యకు సంబంధించి షకీబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్ర‌కారం.. బంగ్లాదేశ్‌లో కొన‌సాగుతున్న నిర‌స‌నలలో ఆగ‌స్టు 7న గార్మెంట్ వర్కర్ ఎండీ రూబెల్‌ మరణించాడు. ఉద్దేశపూర్వ‌కంగానే త‌న కుమారుడ‌ని హ‌త్య చేశార‌ని రూబెల్ తండ్రి రఫీకుల్ ఇస్లాం ఢాకాలోని అడాబోర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్ర‌మంలోనే ష‌కీబ్‌తో పాటు బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా సహా మొత్తం 500 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో షకీబ్‌ను 28వ నిందితుడిగా పేర్కొన్నారు. షకీబుల్ బంగ్లా పార్లమెంట్‌లో మాజీ అవామీ లీగ్ ఎంపీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో టెస్ట్ సిరీస్ ఆడుతోన్న షకీబుల్ తాజా పరిణామాలతో స్వదేశానికి తిరిగి వెళ్ళే అవకాశాలున్నాయి.
దీంతో పాక్‌తో జ‌రిగే రెండో టెస్టుకు అతను అందుబాటులో ఉండకపోవచ్చు. తొలి టెస్టులో పోరాడుతున్న బంగ్లాకు షకీబుల్ లేకుంటే కష్టమే అని చెప్పాలి. మరోవైపు
బంగ్లాదేశ్‌లో హింస‌త్మాక సంఘటనల కొనసాగుతూనే ఉన్నాయి. షేక్ హసీనా రాజీనామా తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికి పరిస్థితులు మాత్రం అదుపులోకి రాలేదు.