Lucknow Super Giants : లక్నోకు బిగ్ షాక్… సీజన్ మొత్తానికీ ఆ బౌలర్ దూరం

ఐపీఎల్ (IPL) ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారిన వేళ లక్నో సూపర్ జైంట్స్ (Lucknow Super Giants) కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

ఐపీఎల్ (IPL) ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారిన వేళ లక్నో సూపర్ జైంట్స్ (Lucknow Super Giants) కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్ ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని తెలుస్తోంది. పొత్తి కడుపు కండరాల గాయం కారణంగా అతను మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని సమాచారం. అరంగేట్ర మ్యాచ్‌లోనే 155 కి.మీ వేగం, వైవిధ్యంతో బంతులు సంధిస్తూ మయాంక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లో ఆడింది నాలుగు మ్యాచ్‌లే అయినప్పటికీ భవిష్యత్ స్టార్‌గా మంచి గుర్తింపు పొందాడు. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ల్లో మయాంక్ యాదవ్ మూడు వికెట్ల చొప్పున పడగొట్టి సత్తాచాటాడు. కానీ ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గాయపడ్డాడు.

తిరిగి కోలుకుని ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పునరాగమనం చేశాడు. కానీ మయాంక్‌ మరోసారి గాయపడ్డాడు. దీంతో మయాంక్ ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం అనుమానమే అని తెలుస్తోంది. అయితే మయాంక్‌కు ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. బీసీసీఐ కాంట్రాక్ట్ పొందితే అతను ఎన్సీఏలో మెరుగైన చికిత్స తీసుకోవచ్చు.
ప్లేఆఫ్స్ రేసు ఆసక్తికరంగా సాగుతున్న ఈ సమయంలో మయాంక్ దూరమవ్వడం లక్నో‌కు ఎదురుదెబ్బే. పరుగులను కట్టడి చేయడంతో పాటు వికెట్లను పడగొట్టే మయాంక్ జట్టు లేకపోవడం ఆ జట్టుకు ప్రతికూలాంశమే. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరింట్లో నెగ్గి 12 పాయింట్లు సాధించింది.