అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. గతంలో టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజాకు కూడా ఇలాగే ఐసీసీ ఫైన్ వేసింది. ఈ సిరీస్ కోసం రిటైర్‌మెంట్ వెనక్కు తీసుకున్న మొయీన్ అలీ.. చక్కగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసుకున్నాడు. కానీ అన్ని ఓవర్లు వేసే అలవాటు తప్పడంతో అతను స్పిన్ చేసే వేలు బాగా దెబ్బతిన్నది. దీంతో రెండో రోజు ఆటలో తన వేలికి నొప్పి పుట్టకుండా స్ప్రే కొట్టుకున్నాడు.
దీంతో అది ఐసీసీ నిబంధనల్లో లెవెల్ వన్ తప్పుగా భావించిన అంపైర్లు.. అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేశారు. దీనిపై ఐసీసీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ‘ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ప్లేయర్స్ అండ్ ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ నిబంధనల్లో ఆర్టికల్ 2.20ని మొయీన్ అలీ ఉల్లంఘించాడు. దీన్ని అతను ఒప్పుకున్నాడు. ఆట స్ఫూర్తికి విరుద్ధంగా అతని ప్రవర్తన ఉంది’ అని ఐసీసీ పేర్కొంది. అయితే ఇలా అతనికి ఫైన్ వేయడం కరెక్ట్ కాదని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అన్నాడు.
అలీ కావాలంటే డ్రెస్సింగ్ రూంకు వెళ్లి స్ప్రే కొట్టుకొని రావొచ్చని, అతనేం కావాలని క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేదని హాగ్ అన్నాడు. ‘మొయీన్ అలీ తన వేలి గాయం మరింత పెరగకుండా ఉండటం కోసం స్ప్రే చేసుకున్నాడు. అతను కావాలంటే ఈ స్ప్రేను దాచిపెట్టి కూడా ఉండొచ్చు. కానీ ధైర్యంగా అందరి ముందే ఈ పని చేశాడు. అతని వేలు చూస్తే అంతకుమించి వేరే మార్గం లేదని తెలుస్తోంది. అలాంటప్పుడు ఇలా 25 శాతం ఫైన్ వేయడం సరికాదు’ అని హాగ్ ట్వీట్ చేశాడు.