ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న విండీస్ ప్లేయర్ డ్వయాన్ బ్రేవో క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతుండగానే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. సీపీఎల్ లో ఆడుతున్నప్పుడు గాయమవడంతో సీజన్ పూర్తి కాకుండానే ఆటకు వీడ్కోలు పలికాడు. బ్రావో 2021 లోనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత నుంచీ ఫ్రాంచైజీ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. ఆడాలని మనసులో ఉన్నా శరీరం సహకరించట్లేదని బ్రావో చెప్పుకొచ్చాడు. టీ20 క్రికెట్‌లో ఎన్నో రికార్డులు బ్రావో పేరిట ఉన్నాయి. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకూ టీ20 క్రికెట్‌లో 582 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 631 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్ తోనూ రాణించి 6970 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన రెండుసార్లు జట్టులో కీలక ఆటగాడి ఉన్నాడు.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుతమైన ఆల్ రౌండర్ గా తనదైన ముద్ర వేశాడు. అలాగే కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లీగ్‌ల్లోనూ ఆల్ రౌండర్ గా అదరగొట్టాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో అయిదుసార్లు ట్రోఫీని అందుకోగా, అందులో మూడు సార్లు ట్రింబాగో నైట్ రైడర్స్ తరఫున ఛాంపియన్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే విండీస్ తరఫున బ్రావో 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 2200 పరుగులు, 86 వికెట్లు , వన్డేల్లో 2968 పరుగులు, 199 వికెట్లు, టీ ట్వంటీల్లో 1255 పరుగులు, 78 వికెట్లు పడగొట్టాడు.